March 25, 2026
Explore
50 ఏళ్ల తరువాత డీలిమిటేషన్‌..!!

50 ఏళ్ల తరువాత డీలిమిటేషన్‌..!!

March 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఛట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌ చేపట్టనుండడంతో దేశంలో లోక్‌సభ నియోజకవర్గాలు, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది.

డీలిమిటేషన్‌లో ప్రక్రియలో భాగంగా దేశంలో, రాష్ట్రాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్యను, వాటి పరిధిని మారుస్తారు. రాజ్యాంగం ప్రకారం పదేళ్లకోసారి నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ చేపట్టాల్పి ఉంటుంది. ఈ మేరకు గతంలో 1952, 1963, 1973లో మూడుసార్లు డీలిమిటేషన్‌ నిర్వహించారు. ఆ తరువాత జనాభాపరంగా రాష్ట్రాల మధ్య హెచ్చుతగ్గులు ఉండడం, అది నియోజకవర్గాల సంఖ్యపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో ఆ అంతరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో 25 ఏళ్లపాటు డీలిమిటేషన్‌ ప్రక్రియను నిలిపివేశారు. 25 ఏళ్లు గడిచాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరో 25 ఏళ్లపాటు నిలిపివేశారు. మధ్యలో ఓసారి డీలిమిటేషన్‌ చేపట్టినా.. సీట్ల సంఖ్యను పెంచకుండా నియోజకవర్గాల పరిధులను మాత్రమే మార్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి 1952లో డీలిమిటేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రశేఖర అయ్యర్‌ నేతృత్వంలోని డీలిమిటేషన్‌ కమిషన్‌.. 1951 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 489 నుంచి 494కు పెంచింది. అనంతరం 1963లో రెండో డీలిమిటేషన్‌ జరిగింది. అప్పుడు లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 494 నుంచి 522కు పెరిగింది. ఇక మూడోసారి 1973లో డీలిమిటేషన్‌ నిర్వహించి నియోజకవర్గాల సంఖ్యను 543కు పెంచారు. అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 3771 నుంచి 3997కు పెంచారు.

1976 నుంచి డీలిమిటేషన్‌ నిలిపివేత..

1973 తరువాత దేశంలో జనాభా భారీగా పెరిగినా.. చాలా కాలంపాటు డీలిమిటేషన్‌ చేపట్టలేదు. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకుగాను రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చేందుకు 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. 25 ఏళ్లపాటు డీలిమిటేషన్‌ ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కోసం ఏకంగా 42వ రాజ్యాంగ సవరణ కూడా చేశారు. ఈ నిలిపివేత నిర్ణయం 2001 వరకు అమల్లో ఉంది. అనంతరం 2001లో నాటి వాజపేయి ప్రభుత్వం కూడా ఇదే కారణం చెబుతూ మరో 25 ఏళ్లపాటు 2026 దాకా డీలిమిటేషన్‌ను చేపట్టరాదని నిర్ణయించింది. మధ్యలో 2002 జూలైలో జస్టిస్‌ కుల్దీ్‌పసింగ్‌ నేతృత్వంలో డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ 2004 నుంచి 2007 వరకు రాష్ట్రాల వారీగా ముసాయిదా ప్రతిపాదనల్ని జారీ చేసింది. 2008లో తుది డీలిమిటేషన్‌ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా.. వాటి పరిధులను మాత్రమే మార్చారు.

2021లో కరోనా కారణంగా..

డీలిమిటేషన్‌ వాయిదా 2026లో ముగిసి మళ్లీ ప్రక్రియ ప్రారంభించేందుకు 2021 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా 2021లో జనాభా లెక్కలను సేకరించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 2026లో జనాభా లెక్కలు చేపట్టి 2029 నాటికి సీట్ల సంఖ్యను పెంచాలన్న ప్రయత్నం కూడా జరిగింది. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేయడంతో ఈ రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం కుటుంబ నియంత్రణను అంతగా పట్టించుకోకపోవడంతో ఆ రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. దీంతో జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ చేపడితే.. దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గిపోయి, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం చెబుతూ వచ్చాయి. ఈ వివాదం ఇలా ఉండగానే.. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 50 శాతం సీట్లు పెంచాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ పెంచిన సీట్ల ప్రకారం నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టడానికి మాత్రం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోనున్నారు.

Tags: Delimitation After 50 Years!!