తిరుపతి ముచ్చట్లు:
- డ్రోన్ కెమెరాలతో జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా.
- ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు తిరుపతి జిల్లా పోలీసులు సమగ్ర కార్యాచరణ చేపట్టారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలపైనా ఉపేక్ష లేకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
ఈ చర్యల్లో భాగంగా డ్రోన్ కెమెరాల ద్వారా అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, గంజాయి సాగుకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ఇతర అనుమానాస్పద ప్రదేశాలపై ప్రత్యేక వైమానిక నిఘా నిర్వహిస్తున్నారు. భూమిపై పోలీసు బృందాల తనిఖీలతో పాటు డ్రోన్ పర్యవేక్షణను సమన్వయం చేయడం ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభ దశలోనే గుర్తించి వెంటనే అడ్డుకునే చర్యలు చేపడుతున్నారు.
ముఖ్యంగా గంజాయి సాగు, గంజాయి రవాణా, అక్రమ మద్యం తయారీ, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిలో పాల్గొనే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనైనా ఉపేక్షించబోమని తెలిపారు.
- ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకం. మీ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
Tags: Tirupati district police take strict action against anti-social activities.