నకిలీ పాసుపుస్తకాలతో మోసగించిన ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్..
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఒక భారీ భూమోసం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కదిరి – పలమనేరు జాతీయ రహదారి ప్రక్కన బసినికొండ పంచాయతీ పరిధిలో సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 2.52 ఎకరాల (సర్వే నంబర్లు 773/D, 773/2C, 773/B, 773/2A, 553/1C3) భూమిని కేవలం రూ. 13 లక్షలకే ఇస్తామని నిందితులు మదనపల్లెకు చెందిన బాధితురాలు పొన్నంరెడ్డి శోభారాణి మరియు ఆమె భర్త పుల్లారెడ్డిలను నమ్మించారు. ముందస్తు పధకం ప్రకారం పొలం వద్దకు తీసుకెళ్లి కొలతలు వేయించి, 01-09-2025న రూ. 13 లక్షలు నగదుగా తీసుకొని అగ్రిమెంట్ రాసిచ్చారు. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పి మరో రూ. 1,00,000/- తీసుకొని, తహసీల్దార్ సంతకం ఉన్నట్లుగా నకిలీ (ఫోర్జరీ) పాస్ పుస్తకాలను సృష్టించి బాధితులకు అందజేశారు.
అయితే, తమకు ఇచ్చిన పాస్ పుస్తకాలు నకిలీవని, సదరు భూమిని అప్పటికే ఇతరులకు విక్రయించారని తెలుసుకున్న బాధితులు నిందితులను నిలదీశారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, నిందితులు ప్రాణహాని కలిగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు 29-07-2026న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, FIR No.220/2026 గా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో మోసం నిర్ధారణ కావడంతో చట్టపరమైన చర్యలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, మదనపల్లె డీఎస్పీ యం. బుచ్చిరాజు పర్యవేక్షణలో తాలూకా సీఐ కళా వెంకటరమణ ఈరోజు (01-08-2026) మధ్యాహ్నం 1:00 గంటలకు నిమ్మనపల్లె నాలుగు రోడ్ల కూడలి (కదిరి – మదనపల్లె మెయిన్ రోడ్డు) వద్ద ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసుతో ఇంకా ఏమైనా సంబంధం ఉన్న ముద్దాయిలను తదుపరి దర్యాప్తులో అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు.
నిందితుల వివరాలు:
- ఉప్పుతోళ్ళ శేఖర్ బాబు (A-1): ల్యాండ్ బ్రోకర్.
- గడియారం మురళి (A-2):
- గడియారం యర్రప్ప (A-3):
- గడియారం మణి (A-4):
- గడియారం రెడ్డెప్ప (A-5):
ప్రజలకు జిల్లా ఎస్పీ హెచ్చరికలు మరియు సూచనలు:
ప్రజలు భూములు కొనుగోలు చేసే ముందు సంబంధిత రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు మరియు భూమి యాజమాన్య హక్కులను సంబంధిత అధికారుల వద్ద తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి.
తక్కువ ధరకే విలువైన భూములు ఇప్పిస్తామని ఆశచూపే వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదు.
ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా రెవెన్యూశాఖ అధికారులను సంప్రదించి మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి , మదనపల్లె డీఎస్పీ యం. బుచ్చిరాజు , తాలూకా సీఐ కళా వెంకటరమణ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Lured with an offer of land worth ₹5 crore at a low price… swindled out of ₹14 lakh!