భోగాపురం ముచ్చట్లు:
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
`
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇవాళ కీలకమైన రోజు అని, ‘స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్’కు సరికొత్త శుభదినమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ శనివారం ఆయన జాతికి అంకితం చేశారు. దీనితో పాటు రాష్ట్రంలో రూ.18,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ‘అందరికీ నమస్కారం’ అంటూ అచ్చ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి స్థానిక ప్రజలను ఆకట్టుకున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవాలు సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవార్లకు ప్రణామాలు అర్పించిన ఆయన, పవిత్రమైన ఈ మట్టిపైకి వచ్చే భాగ్యం దక్కడం తన అదృష్టమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సభకు ముందు నిర్వహించిన గిరిజన సంప్రదాయ ‘థింసా’ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే వేదికపై ఏకంగా 13,000 మంది గిరిజన మహిళలు కలిసి చేసిన ఈ నృత్యం ఒక సరికొత్త రికార్డు అని, ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తాను మధురానుభూతికి లోనయ్యానని ప్రధాని కొనియాడారు. ఇంతటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌ను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్‌వేగా, ఆంధ్రా యువత ఉజ్వల భవిష్యత్తుకు కొత్త లాంచ్పాడ్‌లా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వాల తీరుపై ప్రధాని ఈ సందర్భంగా పరోక్ష విమర్శలు గుప్పించారు. గతంలో దేశంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా కేవలం ఒక్క కుటుంబం పేర్లే పెట్టేవారని, కానీ తమ ప్రభుత్వం స్థానిక మహనీయులకు తగిన గౌరవం కల్పిస్తోందని స్పష్టం చేశారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు వాల్మీకి పేరు, పంజాబ్‌లో సంత్ రవిదాస్ పేరు పెట్టిన విధానాన్ని గుర్తు చేస్తూ.. భోగాపురం విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గర్వకారణమన్నారు. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలే ఉండగా, గత 12 ఏళ్లలో ఆ సంఖ్యను 166కు పెంచి సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేశామని, ఉడాన్ పథకం ద్వారా దేశ విమానయానరంగంలో పెనుమార్పులు తెచ్చామని వివరించారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై మాట్లాడుతూ, దేశంలో బ్లూ ఎకానミーని బలోపేతం చేస్తున్నామని, విశాఖపట్నం నుండి కృష్ణపట్నం వరకు పాత పోర్టులను అభివృద్ధి చేయడంతో పాటు మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నట్లు పీఎం తెలిపారు. ప్రస్తుతం ఏపీలో లక్ష కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో తెలుగు వారి ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్న ప్రధాని, చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ వేగంగా ‘మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’గా మారుతోందని ప్రశంసించారు.
సెమీకండక్టర్, డేటా సెంటర్ రంగాలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నక్కపల్లిలో భారీ ఫార్మా కంపెనీ రూపుదిద్దుకుంటోందని, కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఏపీలో డబుల్ స్పీడ్‌తో అభివృద్ధి సాధ్యమవుతోందని మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: A golden chapter in AP’s development: The ‘Swarnandhra’ vision of transforming into a manufacturing hub.