July 31, 2026
Explore
పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే..?

పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే..?

July 31, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, నర్సంపేట ఎమ్మెల్యేగా సేవలందించారు. కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. ఆయన మృతితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది.

బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన వరంగల్ జిల్లా నల్లబెల్లికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

ఈ నెల 26న హనుమకొండలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర ఛాతినొప్పి రావడంతో వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు గుర్తించి దాదాపు గంటపాటు పలుమార్లు సీపీఆర్ నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. అయితే ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు తీవ్ర నష్టం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని, ఐదు రోజులపాటు చికిత్స పొందిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారని వైద్యులు తెలిపారు.

1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్ రెడ్డి విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన, అనంతరం యువజన కాంగ్రెస్‌లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2001లో టీఆర్ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.

2015లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ ఉద్యమ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయాల్లో తీరని లోటుగా పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

Tags:Peddi Sudarshan Reddy passes away… When and where will the funeral take place?