July 31, 2026
Explore
మృతదేహంగా తీసుకెళ్తుండగా షాకింగ్ ట్విస్ట్.. మహిళకు ప్రాణం పోసిన గుంత..!

మృతదేహంగా తీసుకెళ్తుండగా షాకింగ్ ట్విస్ట్.. మహిళకు ప్రాణం పోసిన గుంత..!

July 31, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా రోడ్లపై ఉన్న గుంతలు ప్రమాదాలకు, ప్రాణనష్టానికి కారణమవుతుంటాయి. అయితే కైకలూరు మండలంలో ఓ రోడ్డు గుంత అనూహ్యంగా ఓ మహిళకు మళ్లీ ప్రాణం పోసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

భుజబలపట్నం గ్రామ మాజీ సర్పంచ్ రామతులసి (48) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకెళ్తున్నారు. అయితే మార్గమధ్యంలో రోడ్డుపై ఉన్న ఓ గుంతలో అంబులెన్స్ ఒక్కసారిగా బలంగా కుదుపునకు గురైంది. ఆ కుదుపు తర్వాత రామతులసి శరీరంలో కదలికలు కనిపించడంతో పాటు ఆమె ఊపిరి తీసుకోవడం ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు అంబులెన్స్‌ను సమీప ఆస్పత్రికి మళ్లించారు.

వైద్యులు మరోసారి పరీక్షలు నిర్వహించగా ఆమె ప్రాణాలతో ఉన్నట్లు నిర్ధారించి అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నట్లు సమాచారం. ఈ అరుదైన ఘటన స్థానికంగా సంచలనంగా మారగా, వైద్యపరంగా ఎలా జరిగిందనే అంశంపై కూడా చర్చ కొనసాగుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి వైద్యుల నుంచి పూర్తి అధికారిక వివరణ రావాల్సి ఉంది.

Tags;Shocking twist while being taken away as a corpse… A pit brought the woman back to life!