ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రతిరోజూ నడకను దినచర్యగా మలచుకోవాలి: – అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి .
మదనపల్లె ముచ్చట్లు:
సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మదనపల్లెలో ‘స్వాస్థ్య వాకథాన్’ ఉత్సాహంగా జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ముఖ్య అతిథిగా విచ్చేసి పచ్చ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సత్సంగ్ ఆశ్రమం వద్ద మొదలైన ఈ నడక.. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్, అనీబిసెంట్ సర్కిల్, బెంగళూరు రోడ్ గుండా సాగి తిరిగి ఆశ్రమానికి చేరుకోగా, దారిపొడవునా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణపై ప్లకార్డులతో ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యమని, శారీరక, మానసిక అనారోగ్య సమస్యలను జయించేందుకు ప్రతిరోజూ నడకను దినచర్యగా మలచుకోవాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలతో పాటు సామాజిక బాధ్యతలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్సంగ్ ప్రతినిధులు పద్మభూషణ్ , సెక్రటరీ మహీందర్, వెంకీ నటరాజన్, డీఎస్పీ ఎం. బుచ్చిరాజు, సీఐలు రాజారెడ్డి, కళా వెంకటరమణ, గురునాథ్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది మరియు విశేష సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
Tags: “Swasthya Walkathon” held with enthusiasm in Madanapalle.