ఇంటర్నెట్‌డెస్క్
ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నప్పటికీ.. ఇరాన్ నుంచి వస్తోన్న సందేశాలు మాత్రం ధిక్కార ధోరణిని కనబరుస్తున్నాయి. ఆ రెండు దేశాలు చేసిన దురాక్రమణకు గానూ.. వారు పశ్చాత్తాప పడేంతవరకూ తమ దాడులు కొనసాగిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చిచెప్పారు. తమ మిత్ర దేశం చైనాతో ఫోన్ సంభాషణలో భాగంగా అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇస్లామిక్ రిపబ్లిక్‌కు చెందిన పౌర, రక్షణ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా శత్రు దేశాలు దాడులు చేయడంతోనే టెహ్రాన్‌లో అస్థిరత చోటుచేసుకుందని అరాగ్చీ తెలిపారు. ‘మా లక్ష్యాలన్నీ నెరవేరడం సహా హింసాత్మక దురాక్రమణకు పాల్పడిన శత్రు దేశాలు పశ్చాత్తాప పడేవరకూ ప్రతీకార దాడులు కొనసాగుతాయి. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడమే మా తొలి ప్రాధాన్యం’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న అభద్రతకు ఈ దురాగతాలే ప్రత్యక్ష కారణమని ఆయన అన్నారు. అందులో భాగంగానే హోర్ముజ్ జలసంధిని మూసివేశామని.. తాము తీసుకున్న చర్యలన్నీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించారు.
మరోవైపు.. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అమెరికా సంకేతాలిస్తుండగా.. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ గూఢచర్య కేంద్రాలే లక్ష్యంగా వరుస దాడులు ప్రారంభించినట్టు ఐఆర్‌జీసీ తెలిపింది. ఇరాన్‌లో ప్రముఖ వ్యక్తులతో తమ చర్చలు కొనసాగుతున్నాయని, ఇది పాలనాపరమైన మార్పునకు సంకేతమని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్న తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
Tags: Retaliatory attacks will not cease until the enemies repent: Iran