పలు ఆలయాల విగ్రహాలు స్వాధీనం
పుంగనూరుముచ్చట్లు:
వివిధ దేవాలయాలలో ఉన్న ఇత్తడి, రాగి, పంచలోహాల విగ్రహాలను చోరీ చేసిన వ్యక్తిని పట్టుకుని , అతడి వద్ద నుంచి పలు దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్బరాయుడు మంగళవారం విలేకరులకు తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లెకి చెందిన ఎలకపల్లిప్రభాకర్ (39) అను వ్యక్తి ఆలయాలలో రాగి, ఇత్తడి, పంచలోహాల విగ్రహాలు, వస్తువులు చోరీ చేసుకుని బయటప్రాంతాల్లో విక్రయాలు సాగించేవాడు. ఈ విధంగా సోమల, నిమ్మనపల్లె, చౌడేపల్లె, సదుం, పుంగనూరు ప్రాంతాలలో దేవాలయాలలో చోరీలపై సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ ల ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో నిందితుడు ప్రభాకర్ పలు ఆలయాలలో చోరీకి పాల్పడినట్లు నిర్ధారించుకుని అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఇలా ఉండగా నిందితుడు చోరీ చేసిన వస్తువులను తీసుకుని ఆటోలో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి ఆలయాలలో చోరీ కాబడిన వస్తువులు, ఆటోను సీజ్ చేశామని సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి , వివిధ నేరాల క్రింద రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఆలయాలలో చోరీ చేసిన వ్యక్తిని పట్టుకున్నందుకు స్థానిక పోలీసులను ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి అభినందించారు.

Tags: Person arrested for stealing idols