July 25, 2026
Explore
రౌడీషీటర్‌పై కఠిన చర్యలు

రౌడీషీటర్‌పై కఠిన చర్యలు

July 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 14 రోజుల రిమాండ్.
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం.
  • నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగిస్తున్న తిరుపతి జిల్లా పోలీసులు.
  • చట్టాన్ని ఉల్లంఘించే వారిపై రాజీలేని చర్యలు.
  • ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, రౌడీషీటర్లు, సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిపై తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో డి. రమేష్ (33), తండ్రి: డి. చెంగల్ రాయులు, బట్టికండ్రిగ AAW, వడమాలపేట మండలం, తిరుపతి జిల్లా నివాసి అయిన వ్యక్తిపై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదవడంతో అతనిపై రౌడీషీట్ తెరిచి నిరంతర నిఘా కొనసాగించారు. గతంలో జైలుశిక్ష అనుభవించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, గ్రామంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదుల మేరకు అతని నేరచరిత్రను పరిగణనలోకి తీసుకుని మంచి ప్రవర్తన కోసం బైండోవర్ చర్యలు చేపట్టారు.

మండల తహశీల్దార్ సమక్షంలో ఒక సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉంటానని, నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వానికి రూ.2 లక్షలు చెల్లిస్తానని అతని నుంచి హామీ పత్రం తీసుకున్నారు. అయితే, అనంతరం హామీ పత్రంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరిగి నేరానికి పాల్పడి ఇద్దరిపై దాడి చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలను తహశీల్దార్‌కు నివేదించగా, విచారణ అనంతరం బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో బాండ్ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. బాండ్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైనందున 24-07-2026న 14 రోజుల రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని తిరుపతి జిల్లా పోలీసులు తెలిపారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సందేశం ఇస్తూ తిరుపతి జిల్లాలో ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించము. రౌడీయిజం, దౌర్జన్యాలు, బెదిరింపులు, బైండోవర్ నిబంధనల ఉల్లంఘనలు లేదా చట్టాన్ని ధిక్కరించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు కూడా చేపట్టడానికి తిరుపతి జిల్లా పోలీసులు వెనుకాడరు. ప్రజలు నిర్భయంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం మా ప్రథమ కర్తవ్యం అని అన్నారు.

Tags:Strict action against rowdy-sheeter