July 25, 2026
Explore
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ

July 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • జ్యేష్ఠాభిషేకాల్లో రెండో రోజు శాస్త్రోక్తంగా విశేష పూజలు
  • భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన తిరుచ్చి ఉత్సవం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో రెండో రోజు శనివారం కవచ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం శతకలశ స్నపనం, మహాశాంతి హోమం వైదిక పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకాలు జరిపి విశేషారాధనలు సమర్పించారు.
తదనంతరం ప్రత్యేక పూజల అనంతరం కవచ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు.

సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులు “గోవింద… గోవింద…” నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ఏ.బి. నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయులు, ఆలయ అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags:Grand Installation of Kavacham at Sri Govindaraja Swamy Temple