July 25, 2026
Explore
పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలి

పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలి

July 25, 2026 | Andhra Pradesh


ప్రమోషన్లు కల్పించి సిబ్బంది కొరతను పరిష్కరించాలి
పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన

మదనపల్లి ముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏఐసీటీఈ–2016 నిబంధనల ప్రకారం పనిచేస్తున్న లెక్చరర్లకు రావాల్సిన పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా మదనపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి, కార్యదర్శి భూ చక్రపాణి ఆధ్వర్యంలో లెక్చరర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు తమకు రావాల్సిన పీఆర్‌సీ బకాయిలు సుమారు రూ.10 లక్షల వరకు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి స్కేల్ మార్పు ద్వారా లభించాల్సిన వేతన పెంపులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా 2012 సంవత్సరం నుంచి ఇప్పటివరకు తమకు రావాల్సిన సీఐఎస్ బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రమోషన్లు కల్పించకపోవడంతో అనేక కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. సిబ్బంది కొరత నేరుగా విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 87 పాలిటెక్నిక్ కళాశాలల్లో యూనియన్ పిలుపు మేరకు బోధనా సిబ్బంది భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.

విద్యార్థులకు బోధనా కార్యక్రమాలను కొనసాగిస్తూనే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టిన లెక్చరర్లు తమ డిమాండ్లతో కూడిన అర్జీని కళాశాల ప్రిన్సిపాల్‌కు సమర్పించారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను కల్పించి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించి తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివారెడ్డి, మరియాదాస్, నూరుల్లా భాష తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Tags;PRC arrears must be paid.