July 24, 2026
Explore
మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్‌లో విద్యార్థినులకు విస్తృత అవగాహన

మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్‌లో విద్యార్థినులకు విస్తృత అవగాహన

July 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • శక్తి టీమ్ – మహిళా పోలీస్ సంయుక్తంగా మహిళలు, బాలికల భద్రతపై చైతన్యం.
  • శక్తి యాప్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, డ్రగ్స్‌పై అవగాహన.
  • మహిళల భద్రత, బాలల హక్కులు, ట్రాఫికింగ్, బాల్య వివాహాల నివారణపై సూచనలు.
  • క్రమశిక్షణ, నైతిక విలువలు, చదువు ప్రాముఖ్యత, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల పట్ల గౌరవం పెంపొందించుకోవాలని సూచన.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల, బాలికల భద్రతా కార్యక్రమాల్లో భాగంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా తిరుపతిలోని పద్మావతి గర్ల్స్ హైస్కూల్, బాలాజీ కాలనీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీమతి దీపిక , శక్తి టీమ్ సిబ్బంది పాల్గొని విద్యార్థినులకు సమాజంలో ఎదురయ్యే వివిధ నేరాలు, వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

విద్యార్థినులకు శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో 112, 1930, 1098, 181 వంటి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ల ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా ఈవ్ టీజింగ్, మహిళలపై జరిగే నేరాలు, సైబర్ మోసాలు, తెలియని లింకులు, వీడియో కాల్స్, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, సమాచారం పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.

అలాగే డ్రగ్స్ దుష్పరిణామాలు, యుక్తవయస్సులో ప్రేమ సంబంధాల వల్ల తలెత్తే సమస్యలు, మొబైల్ గేమ్స్‌కు బానిస కావడం వల్ల కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన అవసరం, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన విధానం వంటి అంశాలను వివరించారు.

ప్రస్తుతం సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన వాస్తవ సంఘటనలు (కేస్ స్టడీస్) ద్వారా విద్యార్థినులకు చైతన్యం కల్పించారు. మహిళల అక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, పిల్లల అదృశ్యం, కిడ్నాప్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఇటువంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

విద్యార్థులు మంచి స్నేహాలను ఏర్పరుచుకోవడం, మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు అలవరుచుకోవడం, క్రమశిక్షణతో ఉండడం, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలను పెంపొందించుకోవడం, చదువుపై పూర్తి దృష్టి పెట్టడం, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను గౌరవించడం ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సమాచారం ఇస్తా విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, సైబర్ భద్రత, మహిళల రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసు హెల్ప్‌లైన్ సేవలను వినియోగించాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటేనే మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని పేర్కొన్నారు.

Tags:Extensive awareness created among female students at the Mega Parents-Teachers Meeting.