July 24, 2026
Explore
ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది

July 24, 2026 | Andhra Pradesh

విరిగిపడుతున్న కొండచరియలు..

చంబా ముచ్చట్లు:

హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో ఓ అంబులెన్స్ సిబ్బందిలోని వ్యక్తి చూపిన ధైర్యసాహసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడి రహదారి పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఏడు నెలల చిన్నారిని అతను సురక్షిత ప్రాంతానికి చేర్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాళ్లు జారుతున్నా.. అడుగు వెనక్కి వేయలేదు..

కొండచరియలు విరిగిపడడంతో రహదారిపై భారీ బండరాళ్లు, మట్టి, శిథిలాలు పేరుకుపోయాయి. మరోవైపు పైనుంచి మరికొన్ని రాళ్లు జారిపడుతున్నాయి. అయినా ఆ యువకుడు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. చిన్నారిని గట్టిగా హత్తుకుని ప్రమాదకర ప్రాంతాన్ని అత్యంత జాగ్రత్తగా దాటించాడు. రాళ్లు పడని సమయం చూసి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుతూ చిన్నారిని మరో అంబులెన్స్ వద్దకు చేర్చాడు. ఆ తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా అవతలి వైపునకు పరిగెత్తుకుంటూ వెళ్లి అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. అనంతరం వారు వేగంగా ఆస్పత్రికి వెళ్లిపోయారు. అయితే, రోడ్డు దాటే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే వారికి సహాయం చేసేందుకు స్థానికులు, ఇతర అత్యవసర సిబ్బంది పరిస్థితిని గమనిస్తూ సిద్ధంగా ఉన్నారు.

ప్రశంసల వెల్లువ..

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా నిఖిల్ సైనీ అనే నెటిజన్ పంచుకున్నారు. ‘కొండ పైనుంచి పడుతున్న రాళ్ల మధ్య తన ప్రాణాలను పణంగా పెట్టి ఏడు నెలల చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్లిన ఆ యువకుడు నిజమైన హీరో. ఆయనకు తగిన గుర్తింపు, ప్రశంసలు దక్కాలి’ అని పోస్టు చేశారు. వీడియో వైరల్ కావడంతో వేలాది మంది నెటిజన్లు స్పందిస్తూ అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఇలాంటి వారే నిజమైన హీరోలు’, ‘ఫ్రంట్‌లైన్ సిబ్బంది సేవలకు సెల్యూట్’, ‘మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం’ అంటూ పలువురు కామెంట్లు చేశారు.

వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్..

హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చంబాతో పాటు పలు జిల్లాల్లో తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. రహదారులు దెబ్బతినడం, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల అత్యవసర వైద్య సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో అంబులెన్స్‌లు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో వైద్య సిబ్బంది, రెస్క్యూ బృందాలు కాలినడకన వెళ్లి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ ఘటన మరోసారి అత్యవసర సేవల సిబ్బంది అంకితభావాన్ని, మానవత్వాన్ని దేశానికి చాటి చెప్పిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags: Ambulance crew saves a young child, risking their own lives.