July 24, 2026
Explore
మరింత భక్తి భావాన్ని పెంచేలా ఎస్వీబీసీ ప్రసారాలు

మరింత భక్తి భావాన్ని పెంచేలా ఎస్వీబీసీ ప్రసారాలు

July 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

సృజనాత్మకత, నాణ్యతతో భక్తులను ఆకట్టుకునే కార్యక్రమాలు రూపొందించాలి – టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించేలా ఎస్వీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలను సృజనాత్మకంగా, నాణ్యంగా రూపొందించాలని టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తో కలిసి ఎస్వీబీసీ రోజువారీ ప్రసారాలు, భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనపై ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమల క్షేత్రంలోని స్థూపాలు, మండపాలు, ప్రాకారాలు, తీర్థాలు, ఉపాలయాలు, శ్రీవారి ప్రసాదాల విశిష్టత తదితర అంశాలను భక్తులకు సులభంగా అర్థమయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. తిరుమల ఆధ్యాత్మిక వైభవం, శ్రీవారి మహిమను ప్రతి భక్తుడి హృదయానికి చేరేలా ఆకర్షణీయమైన కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎస్వీబీసీని వీక్షిస్తున్నారని, ప్రతి కార్యక్రమం భక్తులను చివరి వరకు ఆసక్తిగా చూసేలా ఉండాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తి, భావం, సరళత కలగలిపిన కార్యక్రమాలతో రోజురోజుకు ప్రేక్షకాదరణ పెరిగేలా కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాలను సమీక్షించి, భక్తుల అభిరుచికి అనుగుణంగా మరిన్ని వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అంతకుముందు ఎస్వీబీసీ సీఈవో, టిటిడి జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాల వివరాలను ఈవోకు వివరించారు. హెచ్‌డీపీపీ సహకారంతో ప్రారంభించిన “మహాలక్ష్మీ దీపపూజ” కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, దీనిని గ్రామీణ స్థాయి వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. రానున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని ప్రముఖ కళాకారులతో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.ముందుగా నమూనా ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. సమీక్షకు ముందు ఆధ్యాత్మిక విశేషాల విభాగం, ఎడిట్ విభాగం, పలు స్టూడియో విభాగాలను పరిశీలించి ఈవో పలు సూచనలు చేశారు. విద్యుత్, ఎయిర్ కండిషనర్లను అవసరమైన మేరకే వినియోగించాలని సూచించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీపీవో ఏ.సి. , ఎస్‌ఈ మనోహరం, అకౌంట్స్ ఆఫీసర్ విశ్వనాథ రాయల్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: SVBC broadcasts designed to further enhance the spirit of devotion.