July 23, 2026
Explore
ఏసీబీ వలలో భారీ తిమింగలం.. డీజీఎం వెంకటరమణ అరెస్ట్, రూ.200 కోట్ల ఆస్తులు!

ఏసీబీ వలలో భారీ తిమింగలం.. డీజీఎం వెంకటరమణ అరెస్ట్, రూ.200 కోట్ల ఆస్తులు!

July 23, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో టీజీరెడ్కో డీజీఎం అరెస్ట్

ప్లాట్లు, ఫ్లాట్లు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ

గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన వెంకటరమణ

భార్య పేరుతో పలు రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వహణ

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) డీజీఎం ముత్యం వెంకటరమణను అధికారులు అరెస్టు చేశారు. ఆయన వద్ద లభ్యమైన ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. కాగా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.28 కోట్లుగా ఉంది.

వెంకటరమణ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాదాపు 14 గంటల పాటు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మాదాపూర్, కూకట్‌పల్లి, శేర్లింగంపల్లి, మూసాపేట వంటి కీలక ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లు, భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బ్యాంకు ఖాతాల్లోని రూ.52 లక్షల నగదు, 2,094 గ్రాముల బంగారం, రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, 19 విదేశీ మద్యం బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు.

గతంలో ట్రాన్స్‌కోలో డీఈగా పనిచేసిన వెంకటరమణ, 2019లో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉండగానే, ఇప్పుడు భారీ అక్రమాస్తుల కేసులో ఆయన పట్టుబడటం గమనార్హం. అంతేకాకుండా, ఆయన తన భార్య పేరు మీద ముత్యం కన్‌స్ట్రక్షన్స్, ప్రైడ్ హోమ్స్ సహా నాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలను నడుపుతున్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.

సుదీర్ఘ సోదాల అనంతరం వెంకటరమణను అదుపులోకి తీసుకున్న అధికారులు, ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

Tags: Big fish’ caught in ACB net: DGM Venkataramana arrested; assets worth ₹200 crore!