July 23, 2026
Explore
మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు.

మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు.

July 23, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • శక్తి టీమ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు.
  • మహిళా సాధికారత, మానవ విలువలు, సైబర్ నేరాల నివారణపై విద్యార్థినులకు అవగాహన.
  • డిజిటల్ అరెస్ట్, APK లింక్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా నేరాలపై కేస్ స్టడీస్‌తో వివరణ.
  • శక్తి యాప్, సైబర్ హెల్ప్‌లైన్ 1930, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ వినియోగంపై సూచనలు.
  • మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, మహిళా సాధికారత, సైబర్ నేరాల నివారణపై మహిళా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు శక్తి టీమ్ ఆధ్వర్యంలో రాజశ్రీ మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ శ్రీలత మరియు ఎస్ఐ దీపిక గారు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో (కరకంబాడి)విద్యార్థినులు, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీలత మాట్లాడుతూ మహిళా సాధికారత (Women Empowerment), మానవ విలువలు (Human Values), నైతిక విలువలు (Ethics), భావోద్వేగ నియంత్రణ (Emotional Control) వంటి అంశాల ప్రాముఖ్యతను వివరించారు. మహిళలపై జరిగే వివిధ నేరాలు, వాటికి సంబంధించిన చట్టాలు, వాస్తవ కేసుల ఆధారంగా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు.

అలాగే ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా ఆర్థిక మోసాలు (Financial Frauds), వ్యక్తిగత సమాచార దుర్వినియోగం (Personal Related Crimes), APK లింక్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా వేదికల ద్వారా జరిగే మోసాలు గురించి వివరిస్తూ, వాటి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేస్ స్టడీస్ ద్వారా వివరించారు.

ఇటీవల ఎక్కువగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగాళ్లు అమాయకులను ఎలా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారో వివరించి, అలాంటి కాల్స్ లేదా సందేశాలను నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ – 1930కు ఫిర్యాదు చేయాలని, అలాగే www.cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

అదేవిధంగా మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించి, అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా తక్షణమే పోలీసు సహాయం పొందవచ్చని తెలియజేశారు. ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని వినియోగించాలని సూచించారు.

చివరిగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సందేశాన్ని తెలియజేస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, అపరిచితుల నుంచి వచ్చే లింకులు, సందేశాలు, కాల్స్‌ను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, మహిళల భద్రతకు సంబంధించిన ఏ సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శాఖ ప్రజల భద్రత, మహిళల రక్షణ, సైబర్ నేరాల నియంత్రణకు నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.

Tags: Widespread awareness programs on women’s safety.