రుణమాఫీ చేయాలని డిమాండ్… నెహ్రూ చౌక్,ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
గుడివాడ ముచ్చట్లు:
గుడివాడ పట్టణంలోని టిడ్కో కాలనీ ఫ్లాట్ల లబ్ధిదారులు బుధవారం రోడ్డెక్కారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన రుణమాఫీ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ టిడ్కో కాలనీ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ముందుగా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్లకార్డులు, నినాదాలతో ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ మహిళలు ఆందోళన చేసి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాము టిడ్కో ఫ్లాట్లకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలు నమ్మి గత కొంత కాలంగా రుణం చెల్లించలేదని, ఇప్పుడు వడ్డీ పెరిగి అప్పు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుండి నోటీసులు వస్తున్నాయని, ఇళ్లకు తాళాలు వేస్తామంటూ బ్యాంకు ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు కాలనీలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాలనీలో చెత్తను కూడా సక్రమంగా తొలగించడం లేదని, దీంతో దుర్గంధంలోనే జీవనం సాగించాల్సి వస్తుందని మహిళలు ఆక్రోశించారు.
పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు పంతగాని సురేష్ మాట్లాడుతూ బాధితులకు అండగా నిలిచి ఉద్యమిస్తామని ఆయన ప్రకటించారు. అలాగే సిపిఎం నాయకులు ఆర్.సి.పి రెడ్డి కూడా ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్నికల హామీ పేరుతో వేలాది మంది లబ్ధిదారులను ప్రభుత్వం మోసగించిందని ఆయన ఆరోపించారు. నెలవారీ వాయిదాలు చెల్లించకపోవడంతో కోర్టుల ద్వారా ఫ్లాట్లకు తాళాలు వేసే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
చివరగా లబ్ధిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, వెంటనే టిడ్కో ఫ్లాట్ల రుణమాఫీ చేయాలని, కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, బ్యాంకుల ఒత్తిడిని ఆపాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆందోళన కార్యక్రమంలో రుణమాఫీ పోరాట సమితి అధ్యక్షురాలు మూడేడ్ల ఉమా, కార్యదర్శి సురా బత్తిన కామేశ్వరరావు, ప్లాట్ల లబ్ధిదారులు వాణి, రవణమ్మ, వీరమ్మ కృష్ణవేణి, దుర్గమ్మ,లక్ష్మీ, అమల కుమారి, రమాదేవి, వహీదా, మీరబీ, కరీమున్నిసా,జ్యోతి,మెరిమ్మ, పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు.
Tags: Gudivada TIDCO Colony beneficiaries protest