అనంతపురం ముచ్చట్లు:
జి.ఓ.ఎం.ఎస్. నెం.396 ద్వారా రిజిస్ట్రేషన్ శాఖను గానీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గానీ ప్రైవేటీకరించడం లేదని అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు ఒకే చోట పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానంతో వేగవంతమైన సేవలు అందించేందుకే ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
👉 * యథావిధిగా అధికారాలు: రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని చట్టబద్ధ అధికారాలు, పత్రాల పరిశీలన, నమోదు మరియు రికార్డుల నిర్వహణ వంటి విధులన్నీ యథావిధిగా సబ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ శాఖ ఆధీనంలోనే కొనసాగుతాయి.
👉* డేటా భద్రత: ప్రభుత్వ డేటా లేదా ప్రజల ఆస్తి వివరాలు ఏ ప్రైవేట్ సంస్థకూ బదిలీ కావు. అందువల్ల డేటా భద్రతపై వస్తున్న ఆందోళనలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు.
👉 * ప్రత్యామ్నాయ ఏర్పాట్లు: డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ నేపథ్యములో కూడా జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, నిరంతరంగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా, అవసరమైన వివరాల కోసం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సంప్రదించి తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను యథావిధిగా పొందవచ్చని సూచించారు.
Tags; Reports on the privatization of the Registration Department are baseless: District Registrar clarifies.