హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల అంశం కలకలం రేపింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి సివిల్ సర్వీసెస్‌లో విజేతగా నిలిచిన యువ ఐపీఎస్ నిందితుడు కావటం చర్చనీయాంశంగా మారింది. ఓ ట్రైనీ ఐపీఎస్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం రాత్రి నగరంలోని అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి…
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ (30) ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం నగరంలోని శివరాంపల్లిలో నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఇక్కడే ట్రైనీ ఐపీఎస్‌గా శిక్షణలో ఉన్నాడు. ఈ ఏడాది జూన్ 23 నుంచి అతడు మహిళా ట్రైనీ ఐపీఎస్ వాట్సప్ నంబరుకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఆమె గౌరవాన్ని దెబ్బతీసేలా అకాడమీలో స్నేహితుల ఎదుట తెలుగులో ఇబ్బందికరమైన పదాలతో అమర్యాదకరంగా మాట్లాడాడు. ఆమెకు వేరే వారితో వివాహేతర సంబంధం అంటగట్టి ప్రచారం చేసి మనోవేదనకు గురిచేశాడు. బలవంతంగా ఆమె మొబైల్ లాక్కొని వ్యకిగత మెసేజ్‌లను చూసి ఇబ్బందికి గురిచేశాడు. ఈ నెల 8న బలవంతంగా అతడి గదిలోకి లాక్కెళ్లి బెదిరించి, భయపెట్టి ఫోన్ పాస్‌వర్డ్ సేకరించాడు.
9న రాత్రి 9 గంటలకు మరోసారి బలవంతంగా తనను జుట్టు పట్టుకొని అతడి గదిలోకి గుంజుకెళ్లాడు. గొంతు పిసికి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. 10న రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి భర్తకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉదయ్ కృష్ణారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయ్‌కృష్ణారెడ్డి శిక్షణ సమయంలో సహచరులతో ఇబ్బందికరంగా ప్రవర్తించేవాడని, వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి తప్పుడు సందేశాలతో కొందరిని మనోవేదనకు గురిచేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. శిక్షణలోనే అనుచిత ప్రవర్తనతో కేసులో ఇరుక్కోవడంతో అతడి ఐపీఎస్ హోదాపై అనిశ్చితి నెలకొంది.
స్ఫూర్తిగా నిలిచి.. ప్రవర్తనతో పతనమై..
ఉదయ్ కృష్ణారెడ్డి స్వస్థలం సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ చెంత పెరిగాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. కూరగాయలు అమ్ముతూ నానమ్మకు చేదోడుగా నిలిచాడు. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. 2018 వరకు విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో ఓ సీఐ తోటి వారి ముందు ఉదయ్‌ను అవమానిస్తూ మాట్లాడటంతో భరించలేకపోయాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. నాలుగుసార్లు పరాజయాలు ఎదురైనా పట్టుదలతో ఐదోసారి 360 ర్యాంకుతో విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. శిక్షణ పూర్తిచేసుకొని పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన ఉదయ్‌కృష్ణారెడ్డి ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.
Tags: Issue of sexual harassment at the academy causes a stir.