‘షైనింగ్ స్టార్స్–2026’ అవార్డుల ప్రధానోత్సవం
విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించిన అన్నమయ్య జిల్లా
‘మై స్కూల్–మై ప్రైడ్’ కార్యక్రమం ద్వారా మెరుగైన ఫలితాలు
మదనపల్లె ముచ్చట్లు:
విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించి, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘షైనింగ్ స్టార్స్–2026’ కార్యక్రమంలో భాగంగా, సోమవారం మదనపల్లె పట్టణంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో… రాష్ట్ర ఆర్ అండ్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ మంత్రి మరియు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
2026 సంవత్సరంలో నిర్వహించిన SSC, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్స్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అర్హత ప్రమాణాల ప్రకారం పారదర్శకంగా ప్రతి మండలంలో ఆరుగురు విద్యార్థులను (OC–2, BC–2, SC–1, ST–1) ఎంపిక చేశారు. అన్నమయ్య జిల్లాలో 157 మంది పదో తరగతి విద్యార్థులు, 31 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి ప్రశంసాపత్రం, పతకం, రూ.20,000 నగదు బహుమతిని అందజేయనున్నారు. జిల్లాలో మొత్తం రూ.37.60 లక్షల నగదు బహుమతులు విద్యార్థులకు అందించనున్నారు. అదనంగా, మెరిట్ జాబితా ఆధారంగా CwSN (ప్రత్యేక అవసరాలు గల పిల్లలు) కేటగిరీలో ముగ్గురు ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా ఎంపిక చేశారు.
‘మై స్కూల్–మై ప్రైడ్’తో విద్యా రంగంలో విశేష పురోగతి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నాయకత్వంలో అన్నమయ్య జిల్లాలో రాష్ట్రంలోనే వినూత్నంగా అమలు చేసిన ‘మై స్కూల్–మై ప్రైడ్’ కార్యక్రమం విద్యార్థుల విద్యా ప్రగతికి ఎంతో దోహదపడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక గెజిటెడ్ అధికారిని దత్తత అధికారిగా నియమించి, వారానికి రెండుసార్లు పాఠశాలలను సందర్శించేలా చేసి విద్యార్థుల అభ్యసన పురోగతిని పర్యవేక్షించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వారానికొకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా ప్రణాళికలను అమలు చేయడం జరిగింది.
ఈ సమష్టి కృషి ఫలితంగా అన్నమయ్య జిల్లా 2026లో విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. 2025లో జిల్లాలో మొత్తం SSC ఉత్తీర్ణత శాతం 77.61 శాతంగా ఉండగా, 2026లో 85.88 శాతానికి పెరిగి 8.27 శాతం అభివృద్ధి నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం గత సంవత్సరం 70.93 శాతం ఉండగా, ఈ సంవత్సరం 80.73 శాతానికి పెరిగి 9.80 శాతం, అంటే దాదాపు 10 శాతం పురోగతి సాధించింది.
ఈ గణనీయమైన ఫలితాలతో అన్నమయ్య జిల్లా రాయలసీమ జోన్‌లోని ఎనిమిది జిల్లాల్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా, ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణతలో రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచి విద్యా రంగంలో తన ప్రతిభను చాటుకుంది.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించడం, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా అన్నమయ్య జిల్లాను విద్యా రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తెలిపారు.
Tags:The goal is to encourage talented students.