July 16, 2026
Explore
ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ.6లక్షల జరిమానా

ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ.6లక్షల జరిమానా

July 16, 2026 | Andhra Pradesh

  • శేషాచలం ముచ్చట్లు:
  • తీర్పు వెల్లడించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షలు జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి గురువారం తీర్పు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (RSASTF) కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలుగూరి అమర నారాయణ ద్వారా పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 40/2017 కేసులో ఈ ముద్దాయి కరకంబాడీ బీటు, కృష్ణాపురం సెక్షన్, తిరుపతి రేంజ్ పరిధిలోని హరిత కాలనీ వద్ద అరెస్టయ్యాడు. ఈ వ్యక్తి తమిళనాడు, తిరువన్నామలై జిల్లా పోలూరు తాలూకా, మెలకుప్పనూరు గ్రామానికి చెందిన సి. కుమార్, కాగా ఇతని నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు అతనిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులోని అతి విలువైన సహజ సంపద ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమంగా ప్రవేశించే నేరస్తులకు ఇది హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడేలా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని ఆయన అభినందించారు.

Tags: Red sandalwood smuggler sentenced to five years in prison – Rs 6 lakh fine.