March 24, 2026
Explore
మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక ముందడుగు.. 50శాతం పెరగనున్న ఎంపీ సీట్లు!

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక ముందడుగు.. 50శాతం పెరగనున్న ఎంపీ సీట్లు!

March 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల (2029) నుంచి చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన రెండు బిల్లులను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఒక సరికొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్‌సభలోని ప్రస్తుత 543 స్థానాలను 50 శాతం పెంచి, మొత్తం 816కి చేర్చనున్నారు. కొత్తగా పెరిగే 273 సీట్లను పూర్తిగా మహిళలకు కేటాయిస్తారు. తద్వారా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళా కోటాను అమలు చేయవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.

2011 జనాభా లెక్కల ఆధారంగానే..
గతేడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించిన “నారీ శక్తి వందన్ అధినియం” ప్రకారం జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుంది. జాప్యాన్ని నివారించేందుకు, రాబోయే జనాభా లెక్కల కోసం ఎదురుచూడకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్‌కు సంబంధించిన మరో బిల్లును తీసుకురానుంది.

రాజ్యాంగ సవరణకు పార్లమెంట్‌ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టే బాధ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చేపట్టారు. సోమవారం ఆయన ఎన్డీయే పక్షాలతో పాటు వైసీపీ, బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీ వంటి విపక్ష పార్టీలతో కూడా వేర్వేరుగా సమావేశమయ్యారు. అయితే, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. మహిళా కోటాలో ఓబీసీలకు కూడా ఉప-కోటా ఉండాలని కాంగ్రెస్, ఎస్పీ వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రతిపాదన అమలైతే రాష్ట్రాల వారీగా భారీగా పెర‌గ‌నున్న‌ లోక్‌సభ సీట్ల సంఖ్య
ఈ కొత్త ప్రతిపాదన అమలైతే రాష్ట్రాల వారీగా లోక్‌సభ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 120కి, బీహార్‌లో 40 నుంచి 60కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయి. అలాగే ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణ‌లో 17 నుంచి 26కి పెరుగుతాయి. జనాభా నియంత్రణ పాటించడం వల్ల తమ ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన చెందుతున్న దక్షిణాది రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేసేందుకే, అన్ని రాష్ట్రాల్లో దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం వివరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు కూడా ఇదే నిష్పత్తిలో 84 నుంచి 126కి, 47 నుంచి 70కి పెరుగుతాయి. ఏప్రిల్ 4తో ముగియనున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వీలుకాకపోతే దీనికోసమే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.

Tags: Centre Takes Key Step Forward on Women’s Reservation: MP Seats Set to Increase by 50%!