July 14, 2026
Explore
ఆస్తి రాయించుకుని… తల్లిని రోడ్డుపై వదిలేసిన కూతురు!

ఆస్తి రాయించుకుని… తల్లిని రోడ్డుపై వదిలేసిన కూతురు!

July 14, 2026 | Andhra Pradesh

కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో వృద్ధురాలి ఆవేదన

మదనపల్లె ముచ్చట్లు:

కన్న కూతురే కడుపు కోత మిగిల్చింది. పెన్షన్‌ ఇప్పిస్తానని నమ్మించి, తల్లి పేరున ఉన్న ఆస్తిని రాయించుకుని, ఒంటిపై ఉన్న నగలను లాక్కుని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేసింది. ఈ అమానుష ఘటన అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో వెలుగుచూసింది. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో బాధితురాలు తన పెద్ద కుమార్తెతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి కథనం మేరకు… రామసముద్రం మండలం గుంతలపేటకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కర్ణాటకలో నివాసముంటుండగా, చిన్న కుమార్తె కళావతి స్థానికంగానే ఉంటోంది. కొద్దిరోజుల క్రితం చిన్న కుమార్తె కళావతి… తల్లి లక్ష్మమ్మకు పెన్షన్‌ ఇప్పిస్తానని నమ్మించి తీసుకువెళ్లింది. అనంతరం మోసపూరితంగా తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరిట రాయించుకుంది. అంతటితో ఆగకుండా వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు నగలను సైతం లాక్కుని, ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేసింది.

దీంతో దిక్కుతోచని స్థితిలో లక్ష్మమ్మ కర్ణాటకలో ఉంటున్న తన పెద్ద కుమార్తెకు సమాచారం అందించింది. తల్లి పరిస్థితిని చూసి చలించిపోయిన పెద్ద కుమార్తె, తన చెల్లెలు కళావతిని నిలదీయగా… “నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడైనా చెప్పుకో పో” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. కన్నకూతురు చేసిన మోసానికి, అన్యాయానికి వ్యతిరేకంగా తనకు న్యాయం చేయాలని, తన ఆస్తిని తనకు ఇప్పించాలని బాధితురాలు లక్ష్మమ్మ పెద్ద కుమార్తెతో కలిసి కలెక్టరేట్ వేదికగా కలెక్టర్‌ను వేడుకుంది.

Tags: Daughter abandons mother on the street after getting the property transferred to her name!