కలికిరి ముచ్చట్లు:
కలికిరి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ మెయిన్ రోడ్ ఏ-బ్లాక్‌లో శనివారం 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి వైజాగ్ బాషా ఇంటిపై పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాయల్పాడు–కందూరు ఫీడర్‌కు చెందిన విద్యుత్ తీగ ఇంటిపై పడటంతో మూడు అంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబాల ఇళ్లలోని టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, లైట్లు, విద్యుత్ మీటర్లు, వైరింగ్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లపై ప్రమాదకరంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు.
సమాచారం అందుకున్న వెంటనే పీలేరు విద్యుత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఈ ముజిబుర్ రెహమాన్ విద్యుత్ సరఫరాను నిలిపివేసి, సిబ్బందితో కలిసి తెగిన తీగ స్థానంలో కొత్త వైరును అమర్చి సమస్యను పరిష్కరించారు. ఘటనపై స్థానికులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags; 33kV power line snaps and falls on house; major accident averted.