మదనపల్లెముచ్చట్లు:
మదనపల్లెలో నకిలీ పత్రాలతో సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు యత్నించిన మోసం సబ్‌రిజిస్ట్రార్ అప్రమత్తతతో బయటపడింది. తప్పుడు దస్తావేజులతో పాటు అధికారిని బెదిరించి, ఆయనపై దుష్ప్రచారం చేసిన ముగ్గురిపై మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం, మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ ఎం. గురుస్వామి వద్దకు ఈ నెల 10న బాల సరస్వతమ్మ (69), వెంగళ ఉమానరేష్ (42), బాల గణేష్‌లు బండమీదకమ్మపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 303/1లో ఉన్న 0.25 సెంట్ల కమర్షియల్ స్థలానికి సంబంధించిన విక్రయ దస్తావేజులు, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీని రిజిస్ట్రేషన్ కోసం సమర్పించారు. పత్రాలను కార్యాలయ రికార్డులతో సరిపోల్చిన సబ్‌రిజిస్ట్రార్‌కు వివరాల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపించాయి.
ఆన్‌లైన్ మీసేవ పోర్టల్‌లో పరిశీలించగా 2017లో జారీ చేసినట్లు చూపిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. అలాగే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) ద్వారా ఆస్తి అసలైన యజమానులు నరసిపురం రవీంద్రనాథ్, ఆయన భార్య అని నిర్ధారణ అయింది. నిందితులకు ఆ భూమిపై ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవని, యజమానులను మోసగించి ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు సబ్‌రిజిస్ట్రార్ గుర్తించారు.
దీంతో రిజిస్ట్రేషన్‌ను నిరాకరించిన గురుస్వామిపై నిందితులు ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. “పత్రాలు నకిలీవేనని మాకు తెలుసు, అయినా రిజిస్టర్ చేయండి” అంటూ బెదిరింపులకు దిగడంతో పాటు ఉద్యోగం పోగొడతామని, కిడ్నాప్ చేస్తామని హెచ్చరించినట్లు ఆరోపించారు. అంతేకాకుండా రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందంటూ జిల్లా కలెక్టర్‌కు వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని పంపి దుష్ప్రచారం చేశారని, ప్రతిరోజూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపి మానసికంగా వేధించినట్లు సబ్‌రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు మదనపల్లె వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి బాల సరస్వతమ్మ, వెంగళ ఉమానరేష్, బాల గణేష్‌లపై సంబంధిత బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్లో వెంగళ ఉమానరేష్‌ను అరెస్ట్ చేయగా, బాల సరస్వతమ్మ, బాల గణేష్ పరారీలో ఉన్నారు. నకిలీ పత్రాల తయారీలో సహకరించిన సాక్షులు, ఇతరుల పాత్రపైనా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన తప్పుడు పత్రాలతో ప్రభుత్వాన్ని, అసలైన ఆస్తి యజమానులను మోసగించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేసింది.
Tags: Attempt to register land worth ₹50 crore using forged documents: one arrested, two absconding.