సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామం రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాయచోటి సహాయ వ్యవసాయ సంచాలకురాలు (ఏడీఏ) శ్రీలత మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పచ్చిరొట్టి ఎరువులు, జీవ ఎరువులు వినియోగించడం, లోతు దుక్కులు, కంచె పంటలు, పంట మార్పిడి, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా దిగుబడులు మెరుగుపడతాయని వివరించారు.
మామిడి, కంది, వేరుశనగ పంటలలో చీడపీడల నివారణ, పోషక నిర్వహణ, సమగ్ర సంరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కంది సౌభాగ్య రకం సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశముందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలు పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆత్మ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణలు, సాంకేతిక సేవలు, రైతు అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏటీఎం ఎం. కిశోర్, బీటీఎం వెంకటరామయ్య, ఏటీఏ అరుణ, వీఏఏ దేవేంద్ర, టీడీపీ నాయకుడు మల్లికార్జున్ నాయుడు, వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Tags:ATMA creates awareness among farmers about the impact of El Niño.