July 6, 2026
Explore
48% లాభం పేరిట 6 వేల మందికి కుచ్చుటోపీ

48% లాభం పేరిట 6 వేల మందికి కుచ్చుటోపీ

July 6, 2026 | Andhra Pradesh

సైబరాబాద్ ముచ్చట్లు:

  • బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 1,500 మంది
  • షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థల ఎండీ అరెస్ట్

‘రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ఏడాదికి 48% లాభం చెల్లిస్తాం’ అంటూ దేశవ్యాప్తంగా ఆరు వేల మందిని ముంచిన షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్బీపీఎల్), కిసాన్ పరివార్ లిమిటెడ్(కేపీఎల్) సంస్థల వ్యవస్థాపకుడు, ఎండీ నేనావత్ భూపాలానాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఈ రెండు కంపెనీల పేరుతో దేశవ్యాప్తంగా రూ. వందల కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 1500 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. భూపాల్నాయక్ కు ఇటీవల గుజరాత్ పోలీసులు అరెస్టు చేయగా… సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు శుక్రవారం రాత్రి పీటీ వారెంటుపై హైదరాబాద్ కు తీసుకొచ్చారు.

మహబూబాబాద్ జిల్లా కురివి కందికొండకు చెందిన భూపాల్ నాయక్… కూకట్ పల్లి, కొండాపూర్ లో 2020లో ఎస్బీపీఎల్, కేపీఎల్ సంస్థలను ప్రారంభించాడు. ఎస్బీపీల్… స్టాక్ ట్రేడింగ్ చేస్తోందని, కేపీఎల్.. రైతుల నుంచి భూములను సమీకరించి ప్రకృతి వ్యవసాయం చేస్తోందని ప్రచారం చేశాడు. ప్లాన్-ఏ కింద పెట్టుబడికి 18%, ప్లాన్-బి కింద 30%, ప్లాన్-సీ కింద 48% చొప్పున వార్షిక లాభం ఇస్తామని చెప్పేవాడు. రూ.12.5 లక్షల పెట్టుబడి పెడితే.. 5 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసి.. 24% లాభం ఇస్తామన్నాడు. అతన్ని నమ్మిన వందల మంది రూ. కోట్లలో డబ్బు బదిలీ చేశారు. మొదట్లో లాభాలు పంచినా గతేడాది సెప్టెంబరు నుంచి మాయమయ్యాడు. మోకిలకు చెందిన నేవీ విశ్రాంత అధికారి సంజీవ్ గుప్త, మరో 10 మంది.. ఈ రెండు సంస్థల్లో రూ.4.51 కోట్ల పెట్టుబడి పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో జూన్ 15న కేసు నమోదైంది.

గుజరాత్ లోను కేసులు:
భూపాల్ నాయక్ గుజరాత్లో లోనూ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు భూపాలు శంషాబాద్ విమానాశ్రయంలో 10 రోజుల క్రితం అరెస్టు చేసి గుజరాత్ తీసుకెళ్లారు. సైబరాబాద్ పోలీసులు పీటీ వారెంట్పై నగరానికి తీసుకొచ్చారు. ఈ మోసంలో నిందితుడికి.. పలువురు సహకరించినట్లు బాధితులు పేర్కొంటున్నారు.
భూపాల్ నాయక్ 2023 శాసనసభ ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. మండలస్థాయి ఏజెంట్లకు బైక్లు పంపిణీ చేశాడు. బోర్ల తవ్వకాలు, విద్యార్థులకు బస్ పాసుల పంపిణీ తదితర ప్రచారంతో ఊదరగొట్టాడు.

Tags: 6,000 people duped with promises of 48% profit.