July 6, 2026
Explore
ఇవాళ బాలమురళీకృష్ణ జయంతి.

ఇవాళ బాలమురళీకృష్ణ జయంతి.

July 6, 2026 | Andhra Pradesh

శ్రీమాన్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ||

“కర్ణాటక సంగీతం సంగతి”

కర్ణాటక సంగీత వైతాళికుడు బాలమురళీకృష్ణ.

కర్ణాటక ముచ్చట్లు:

1910 తరువాత కర్ణాటక సంగీతం‌ వికలమైపోయి జనాదరణకు దూరమైపోయింది. ఆ తరుణంలో దాన్ని బతికించి, జనాళి ఆమోదాన్ని , ఆదరణను పొందేట్టు చేసిన మేధావంతమైన కళాకారులు మహారాజపురం విశ్వనాద అయ్యర్, జి.ఎన్.‌బాలసుబ్రహ్మణ్యన్,‌ అరియక్కుడి రామానుజ అయ్యంగార్ లతో పాటు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ లు తమ మేధతో, గానప్రతిభతో కర్ణాటక సంగీతానికి విభవాన్ని తీసుకు వచ్చారు.

అటు తరువాత బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీతానికి పెను ఊపును తీసుకు వచ్చారు. ఒక దశలో బాలమురళి పాడేది సంగీతం కాదని మద్రాస్ కోర్ట్ లో కేసు కూడా జరిగింది! ఆ కేసులో బాలమురళి విజయం సాధించారు. బాలమురళి విజయం కర్ణాటక సంగీతం విజయం.‌ బాలమురళి స్ఫూర్తిగా ఎందరో గాయకులు వచ్చారు. ఆయన ఆదిగా కర్ణాటక సంగీతంలోకి మేధ వచ్చింది.

బాలమురళి వేదిక ఎక్కగానే సరస్వతి‌ వారిని అవహిస్తుంది. వారు సంగీతం పాడరు. వారిని‌ సంగీతం పాడుకుంటుంది. మామూలుగా శాస్త్రీయసంగీత గాయకులు‌ కఠోరమైన సాధన‌ చేస్తారు. బాలమురళి చెయ్యరు. సభలో పాడడానికి కూర్చున్నాక, గళం విప్పాక వారి నుంచి సంగీతం‌ వచ్చేస్తుంది. ఆదిభట్ల నారాయణ దాసు తమ హరిశ్చంద్రోపాఖ్యానంలో‌ “నా నాల్క యద్దంబున బూని నిన్నే చూచుకో” అని‌ అమ్మవారిని కోరుకుంటారు. మఱి బాలమురళి కూడా అలా అమ్మవారిని కోరుకున్నారేమో? బాలమురళి నాలుకపై‌ అమ్మ‌వారు గానంగా ప్రతిబింబిస్తుంది. బాలమురళి సంగీతంలో ఒక బాలమేధావి. వారు ఒక శాస్త్రీయ సంగీత‌‌ పరిశోధకులు. కర్ణాటక సంగీతంలో వారు ఒక విప్లవం.

సాహిత్యాన్ని చంపకుండా, జిడ్డు లేకుండా గొప్పగా పాడగలిగిన వారు ఆయన. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. తొలిదశలో జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యన్ గానాన్ని ఆదర్శంగా తీసుకున్న బాలమురళి తరువాతి కాలంలో కట్ణాటక సంగీత గానానికి అవసరమైన ఆదర్శమయ్యారు. కర్ణాటక సంగీతాన్ని తమ గానంతో ఉజ్జ్వలనం చేశారు. మేధ… మేధ…మేధ.‌.‌. బాలమురళి అన్న మేధ కర్ణాటక సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసింది.

వారు విజయవాడ నుండి మద్రాసుకు వెళ్లడం వల్ల వారికి, సంగీతానికి మేలు జరిగింది. ఆంధ్రలోనే ఉండి ఉంటే బాలమురళి ఈ మేరకు రాణించి ఉండేవారు కాదు.

వారు విశేషమైన సంగీత కళాకారులూ, వేత్త మాత్రమే కాదు ఓ కవి కూడా. ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాశారు. మంచి వచనం రాశారు‌. తెలుగు, తమిళ, సంస్కృతం భాషల్లో కీర్తనలు రాశారు. ఆ భాషల్లో వారు రాసిన‌ కీర్తనలు సూర్యకాంతి పేరుతో పుస్తకంగా వచ్చాయి. వారి చేతి రాతతోనే ఆ రచనల పుస్తకం అచ్చయింది. అందులో వారు రాసిన వర్ణాలు, కీర్తనలు,కృతులు, తిల్లానాలు ఉన్నాయి.

Tags: Today is Balamuralikrishna’s birth anniversary.