June 28, 2026
Explore
వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం

June 28, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

  • స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత
    శ్రీ మలయప్పస్వామివారు తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం
    శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు సదాశివరావు, జానకి దేవి , సుచిత్ర ఎల్లా, ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags; Jyeshthabhishekam Concludes Grandly