June 28, 2026
Explore
అక్క, తమ్ముడు మృతి- అన్నదమ్ముల ఇంట విషాదం

అక్క, తమ్ముడు మృతి- అన్నదమ్ముల ఇంట విషాదం

June 28, 2026 | Andhra Pradesh

-తల్లిదండ్రుల ఎదుటే బిడ్డలను మింగేసిన సముద్రం

  • శవాలైన బిడ్డలను కడసారి చూసేందుకు సౌదీ నుంచి రాక
  • కందూరులో విషాదం

సోమల ముచ్చట్లు:

సాధారణ పేద కుటుంబంలోని అన్న, తమ్ముళ్ల రెండు కుటుంభాలు కలసి సంతోషంగా నెల్లూరులోని రొట్టెల పండుగకు వెళ్లారు. మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే ఉన్న సముద్రం ఒడ్డున సరదాగా ఆడుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో విధి ఆడిన నాటకంలో అన్నతమ్ముళ్లకు చెందిన ముగ్గరు పిల్లలను సముద్రం కబళించింది. అక్కడ ఉన్న జనం ఒక బాలికను మాత్రం రక్షించగా, ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రుల ఎదుటే సముద్ర గర్భంలో కలసిపోవడంతో రెండు కుటుంభాల భవిష్యత్తు విచ్చినమైన విషాదకర సంఘటన శనివారం నెల్లూరు జిల్లా జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన అన్సర్‌బాషా, అఫ్‌సియాబేగం దంపతులకు నఫిసానుక్సాన(15), మహమ్మద్‌ సుఫియాన్‌(8) లకు ఇద్దరు పిల్లలు. అలాగే వీరి తమ్ముడు మహమ్మద్‌రఫి, మహబూబ్‌జాన్‌ దంపతులకు మహమ్మద్‌సుఫియాన్‌ (11), సమ్రీన్‌(8) ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఉండటానికి ఇల్లు మినహా ఏమి లేని అన్నదమ్ములు పిల్లలే ఆస్తులుగా  జీవనం సాగిస్తున్న వీరిద్దరు సొంత అన్నదమ్ములు కావడం గమనార్హం. ఇలా ఉండగా అన్సర్‌బాషా మదనపల్లెలో లారీ షెడ్డులో పని చేస్తాడు. మహమ్మద్‌రఫి సౌదీకి కూలీ పనులు నిమిత్తం వెళ్లాడు. అన్న అన్సర్‌బాషాతో కలసి వారి కుటుంబం, తమ్ముడి భార్య , పిల్లలు కలసి శుక్రవారం నెల్లూరులోని రొట్టెల పండుగలో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లారు. సాయంత్రం రొట్టెలు మార్చుకుని పిల్లల భవిష్యత్తు బాగుండాలని, కుటుంబం బాగుపడితే వచ్చే ఏడాది తిరిగి రొట్టెలు మార్చుకుంటామని మొక్కులు చేసుకుని బయటకు వచ్చారు. నెల్లూరు సమీపంలోని సముద్రపు ఒడ్డుకు వెళ్లి సరదాగా గడపాలనుకున్న చిన్నారులను అలల ప్రవాహం ఈడ్చుకెళ్లింది. తల్లిదండ్రుల ఎదుట ముగ్గరు పిల్లలు  నఫిసానుక్సాన, సమ్రీన్‌, సుఫియాన్‌ లు కొట్టుకుపోవడంతో తల్లిదండ్రులు, ఆప్రాంతంలోని ఆర్తనాదాలతో జనం ఉలిక్కిపడ్డారు. పిల్లలను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ సమ్రీన్‌ ను మాత్రం కాపాడగా , ఇద్దరు పిల్లలు నఫిసానుక్సాన, సుఫియాన్‌ లను సముద్రం కబళించేసింది.  సమ్రీన్‌ ను ఆసుపత్రికి తరలించగా బాలిక మృత్యువుతో పోరాడుతోంది.  ఈ మేరకు  నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి, శవాలను పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భౌతికకాయాలను నెల్లూరు నుంచి  కందూరుకు సాయంత్రం తీసుకొచ్చారు. 

విదేశాల నుంచి రఫి రాక….

సముద్రంలో అన్న బిడ్డతో పాటు తన బిడ్డ మృత్యువాత పడ్డారన్న సమాచారం తెలియగానే మహమ్మద్‌రఫి కన్నీరుమున్నీరై లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుని బిడ్డలను కడసారి చూసేందుకు హుటాహుటిన సౌదీ నుంచి బయలుదేరాడు. ఆదివారం రాత్రి కందూరుకు రాగానే సోమవారం చిన్నారుల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చిన్నారుల మృత్యువార్త తెలియగానే కందూరు గ్రామం విషాదంలో మునిగిపోయింది. చిన్నారులను కడసారి చూసేందుకు గ్రామస్తులు విషణ్ణవదనాలతో ఎదురుచూస్తున్నారు.

Tags; Death of sister and younger brother – Tragedy in the brothers’ household.