June 28, 2026
Explore
సదుంలో పోలీసులపైనే దాడి చేసిన హర్యానా వ్యక్తులు

సదుంలో పోలీసులపైనే దాడి చేసిన హర్యానా వ్యక్తులు

June 28, 2026 | Andhra Pradesh

సదుంముచ్చట్లు:

.. కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరిక.

అన్నమయ్య జిల్లా సదుం పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తుకు బానిసైన ఇద్దరు హర్యానా వ్యక్తులు ఏకంగా పోలీసుల పైనే దాడికి తెగబడ్డారు.విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సదుం గాంధీ రోడ్డులోని సాయిబాబా దేవాలయం ఎదురుగా ఉన్న దస్తగిరి ఇంట్లో హర్యానాకు చెందిన హితేశ్వర్, రామేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు అద్దెకు ఉంటున్నారు. వీరు డ్రగ్స్ వినియోగిస్తూ, అక్రమంగా రివాల్వర్ కలిగి ఉండి స్థానికులను బెదిరిస్తున్నారనే పక్కా సమాచారంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సదుం ఎస్ఐ విష్ణు నారాయణ, కానిస్టేబుల్ సుబ్రమణ్యం, హోంగార్డు చాంద్ బాషా తనిఖీ కోసం వారి నివాసానికి వెళ్లారు.

అక్కడ అనుమానాస్పద స్థితిలో ఉన్న హుక్కా మిషన్‌ను గమనించిన ఎస్ఐ.. “ఇదేంటి? ఇక్కడ ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించేలోపే, తీవ్ర మత్తులో ఉన్న ఆ వ్యక్తులు ఒక్కసారిగా ఎస్ఐ సహా పోలీసు సిబ్బందిపై దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని తీవ్రంగా ప్రతిఘటించి అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసంలో క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 10 లీటర్ల నాటుసారా, 18 మద్యం బాటిళ్లు, హుక్కా మిషన్, ఒక బాకు (కత్తి) లభ్యమయ్యాయి.

వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులను స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో స్థానిక బస్టాండ్ వద్ద, “పోలీసుల పైనే దాడి చేస్తారా?” అంటూ ఆ హర్యానా వ్యక్తులను ప్రశ్నించిన కొందరు స్థానికుల పైనా వారు రెచ్చిపోయి పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఎట్టకేలకు పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ దాడిలో గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డులను సదుం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తక్షణమే స్పందించారు. గాయపడిన పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసులపైనే దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Tags:Individuals from Haryana attack police in Sadum.