తిరుపతి ముచ్చట్లు:
- నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రూ.45 లక్షల విలువైన బంగారు ఆభరణాల అప్పగింత
- రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను యజమానికి అప్పగించిన హోటల్ క్యాషియర్.
- డయల్-112 సమాచారంతో వెంటనే స్పందించి బ్యాగ్‌ను గుర్తించిన పోలీసులు.
- నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన క్యాషియర్ శశిని సన్మానించిన జిల్లా ఎస్పీ.
- సమాజానికి ఆదర్శంగా నిలిచే విలువలను కొనియాడిన జిల్లా పోలీస్ శాఖ.
తిరుపతి జిల్లా
తిరుమలలో కుటుంబ వివాహ కార్యక్రమం ముగించుకుని బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతున్న ఓ కుటుంబం మార్గమధ్యలో అలిపిరి సమీపంలోని గరుడాద్రి హోటల్‌లో భోజనం చేసిన అనంతరం, సుమారు రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయి వెళ్లిపోయారు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు భరత్ కుమార్ డయల్-112కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి హోటల్ వద్ద విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గరుడాద్రి హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శ్రీమతి శశి, కస్టమర్లు మరిచిపోయిన బ్యాగ్‌ను గమనించి అందులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుసుకుని, ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అత్యంత భద్రంగా దాచిపెట్టి సంరక్షించినట్లు గుర్తించారు.
పోలీసుల సమక్షంలో బ్యాగ్‌ను తెరిచి పరిశీలించగా అందులో ఉన్న సుమారు 300 గ్రాముల బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం ఆ బ్యాగ్‌ను బాధితుడు భరత్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సందర్భంగా బాధితుడు భరత్ కుమార్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో జరిగిన వివాహానికి సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలన్నీ ఆ బ్యాగ్‌లోనే ఉన్నాయని, బ్యాగ్ తిరిగి దొరకకపోతే కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలిపారు. హోటల్ క్యాషియర్ శశి చూపిన నిజాయితీతో పాటు, డయల్-112కు సమాచారం అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న పోలీసుల సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ఘటనపై స్పందించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, , “నిజాయితీ అనేది మనిషి సంపాదించగలిగే అత్యంత విలువైన ఆస్తి. లక్షల రూపాయల విలువైన ఆభరణాలు దొరికినా వాటిని యథావిధిగా యజమానికి అప్పగించడం గొప్ప మానవీయ విలువలకు నిదర్శనం. శ్రీమతి శశి చూపిన బాధ్యత, నిబద్ధత, నిజాయితీ సమాజంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఇటువంటి వ్యక్తుల వల్లనే సమాజంలో నైతిక విలువలు మరింత బలపడతాయి. అలాగే ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తుంది” అని పేర్కొన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో శ్రీమతి శశిని సాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఆమె నిజాయితీని కొనియాడుతూ ప్రశంసించారు, సమాజంలో మానవీయ విలువలు, నిజాయితీ, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ఈ ఘటన ఒక ఉత్తమ ఉదాహరణగా నిలిచిందని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ శ్రీనివాసులు (పరిపాలన)గారు చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ సిఐ మద్దయ్యాచారి వారు పాల్గొన్నారు.
Tags: Handing over of gold jewelry worth Rs 45 lakh