తిరుపతి ముచ్చట్లు:
- తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇంటి దొంగతనం కేసు 24 గంటల్లోనే ఛేదన.
- ముగ్గురు ముద్దాయిల అరెస్టు.
- రూ.93,00,000/- విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం.
- కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందానికి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, అభినందనలు, రివార్డుల ప్రకటన.
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఇంటి దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటలలోపే ఛేదించి, ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి, రూ.93,00,000/- విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ ఏ శ్రీనివాసులు (పరిపాలన) వివరాలను వెల్లడించారు.
24-06-2026 తేదీన ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12:50 గంటల మధ్యలో, తిరుపతి రూరల్ మండలం చెర్లపల్లి గ్రామం, తాటితోపు, వెంకటపతి నగర్‌లోని శ్రీమతి కె.ఆర్. యశోదమ్మ నివాస గృహంలో ఆమె ఇంటిలో లేని సమయంలో నిందితులు ఇంటిలోకి ప్రవేశించి బీరువా తలుపును విరగ్గొట్టి, అందులో భద్రపరిచిన గోద్రేజ్ లాకర్‌ను అపహరించారు. లాకర్‌లో సుమారు 600 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు, 1½ కిలోల వెండి వస్తువులు మరియు రూ.50,000/- నగదు ఉండగా వాటిని దొంగిలించి పరారయ్యారు. చోరీకి గురైన ఆస్తి మొత్తం విలువ సుమారు రూ.93,00,000/-గా అంచనా వేయబడింది.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, క్రైమ్ ఇన్‌చార్జ్ అదనపు ఎస్పీ ఎ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో, చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి మరియు ప్రత్యేక బృందాలకు నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు.
దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించిన పోలీసులు, 25-06-2026 తేదీ ఉదయం 8:00 గంటలకు తిరుపతి – చంద్రగిరి బైపాస్ రోడ్డులోని ఒమేగా హాస్పిటల్ సమీపంలోని చెర్లపల్లి సర్కిల్ వద్ద ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో ప్రధాన నిందితురాలు సోనియా బాధితురాలికి సమీప బంధువు కావడం, గతంలో బాధితురాలి ఇంట్లో ఉండి ఇంటి పరిస్థితులు, ఆభరణాల నిల్వ ప్రదేశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం వల్ల ముందస్తు పథకం ప్రకారం నంద్యాల బాబు, ఐలోని అనితలతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు అంగీకరించింది.
ముద్దాయిల వద్ద నుండి చోరీకి ఉపయోగించిన స్కూటర్, గోద్రేజ్ లాకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లాకర్‌ను తెరిచి పరిశీలించగా అందులో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు మరియు రూ.50,000/- నగదుతో సహా మొత్తం చోరీ సొత్తును రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం విలువ రూ.93,00,000/-గా నిర్ధారించబడింది.
ఫిర్యాదుదారు :
శ్రీమతి కె.ఆర్. యశోదమ్మ, వయస్సు 59 సంవత్సరాలు, భర్త కె.ఆర్. హరి, డోర్ నెం.3-274, వెంకటపతి నగర్, తాటితోపు, చెర్లపల్లి గ్రామం, తిరుపతి రూరల్ మండలం.
ముద్దాయిల వివరాలు :
A1. పూజారి సోనియా, వయస్సు 28 సంవత్సరాలు, భర్త లేట్ ఎ. శివ, డోర్ నెం.3-275/B, వెంకటపతి పురం, చెర్లపల్లి, తిరుపతి రూరల్ మండలం, తిరుపతి జిల్లా.
A2. నంద్యాల బాబు, వయస్సు 31 సంవత్సరాలు, తండ్రి లేట్ ఎన్. తిరుపాల్, డోర్ నెం.2-102/B, ముత్యాలమ్మ గుడి సమీపంలో, పేరూరు గ్రామం, తిరుపతి రూరల్ మండలం, తిరుపతి జిల్లా.
A3. ఐలోని అనిత, వయస్సు 26 సంవత్సరాలు, భర్త దినేష్, డోర్ నెం.6-8-S-711, గంగమ్మ గుడి సమీపంలో, సింగాలగుంట, తిరుపతి నగరం, ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా, అనంతపురం నివాసం.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి, పూర్తి చోరీ సొత్తును రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించిన తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి, ఎస్‌ఐలు లోకేష్ కుమార్, శ్రీరామ్, జ్యోతి మరియు సిబ్బంది లక్ష్మీ ప్రసాద్, సూర్య ప్రసాద్, ప్రశాంత్ కుమార్, రమేష్, దాసు నాయుడు, శ్రావణిలను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, అభినందించి, ప్రశంసా పత్రాలతో పాటు రివార్డులు ప్రకటించారు.
Tags: Gold and silver jewelry and cash worth Rs. 93,00,000 seized.