June 23, 2026
Explore
ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్నకూతురిని హత్య చేసిన తండ్రి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్నకూతురిని హత్య చేసిన తండ్రి

June 23, 2026 | Andhra Pradesh


ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చిన నిజం

మాచర్ల ముచ్చట్లు:

మాచర్ల, ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుందనే ఆగ్రహంతో కన్న తండ్రే తన కుమార్తెను హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా మాచర్లలో కలకలం రేపింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మాచర్ల పట్టణంలోని 22వ వార్డు యాదవ బజార్‌కు చెందిన చంద్రశ్రీనుకు ఇద్దరు సంతానం. కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో నివసించే జమ్మలమడక నాగరాజుతో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ, తమ ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించరని భావించిన జంట ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది.

వివాహం అనంతరం కొంతకాలం చెన్నైలో ఉన్న వీరు, తర్వాత నరసరావుపేటలోని ఓ స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందారు. కుమార్తె కనిపించకపోవడంతో చంద్రశ్రీను మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో గురజాల డీఎస్పీ జోక్యం చేసుకుని యువతి ఆచూకీ కనుగొంటామని హామీ ఇవ్వడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పోలీసులు చౌడేశ్వరి, నాగరాజు ఆచూకీ గుర్తించి వారిని మాచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చర్చలు జరిపారు. ఇద్దరూ మేజర్లు కావడంతో తాము చట్టపరంగా ఏమీ చేయలేమని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, పెద్దల సూచన మేరకు ఐదు రోజుల పాటు ఎవరింటికి వారు వెళ్లి, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో చౌడేశ్వరిని తన ఇంటికి తీసుకెళ్లిన చంద్రశ్రీను, మరుసటి రోజు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులకు తెలిపాడు. దీంతో ప్రేమ వివాహం కారణంగా మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుందని మొదట అందరూ భావించారు.

అయితే, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చౌడేశ్వరి గొంతు నులిమి హత్య చేసిన అనంతరం, ఆమెను ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు తండ్రి చంద్రశ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కూతురు తనకు ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకుందనే కారణంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Tags: Father murders his own daughter out of anger over her love marriage.