June 20, 2026
Explore
పోలీస్ స్టేషన్లలో పారలు పట్టిన ఖాకీలు

పోలీస్ స్టేషన్లలో పారలు పట్టిన ఖాకీలు

June 20, 2026 | Andhra Pradesh

: అన్నమయ్య జిల్లాలో ఘనంగా ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’

మదనపల్లి ముచ్చట్లు:

పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యకరమైన జీవనానికి అసలైన పునాది అని, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం పేర్కొంది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, శనివారం అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈ బృహత్తర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంతో పాటు జిల్లాలోని అన్ని డీఎస్పీ కార్యాలయాలు, సర్కిల్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలో అధికారులు, సిబ్బంది స్వయంగా గడ్డపారలు, గుణపాలు చేతబట్టి రంగంలోకి దిగారు. కార్యాలయాల చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, పచ్చిక మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను అద్దంలా తీర్చిదిద్దారు. వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు చేరకుండా ఉండేందుకు కార్యాలయాల ఆవరణలో ఉన్న చిన్న చిన్న గుంతలను మట్టితో పూడ్చివేశారు. ఎస్పీ పిలుపుతో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ శ్రమదానంలో పాల్గొని తమ స్టేషన్లను, పరిసరాలను శుభ్రం చేసుకోవడం విశేషం. కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, ప్రజా ఆరోగ్యానికి ఊతమిచ్చే ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లోనూ తాము ఎల్లప్పుడూ ముందే ఉంటామని ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ చాటిచెప్పింది. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:Police personnel wielded spades at police stations.