June 19, 2026
Explore
పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

June 19, 2026 | Andhra Pradesh

ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు

పల్నాడుముచ్చట్లు:

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఈ నెల 20వ తేదీ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రోటోకాల్ మంత్రి పెందుర్తి వెంకటేష్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మొదట అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడతారని పేర్కొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభ నుంచి ‘స్వచ్ఛ్ ఆంధ్ర’ కార్యక్రమంతో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా (పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి) రూ. 7,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. ఇదే సభలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ భారీ బహిరంగ సభలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభి తదితరులు పాల్గొననున్నారు. పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల హెలిపాడ్ నుండి సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికితిరుగుపయనమవుతారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

Tags: CM Chandrababu to visit Palnadu district tomorrow.