June 19, 2026
Explore
ఆంధ్ర రాష్ట్రంలో మేలిమి బంగారు కొండలు

ఆంధ్ర రాష్ట్రంలో మేలిమి బంగారు కొండలు

June 19, 2026 | Andhra Pradesh

….రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది.
స్వాతంత్ర్యం తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అవుతున్న అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.

దాదాపు 598 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 13.1 టన్నుల బంగారు నిల్వలు గుర్తించారు. ప్రస్తుతం సుమారు 13 వేల కిలోల బంగారం ఉన్నట్లు ధృవీకరించగా, మొత్తం లీజు ప్రాంతంలో 50 వేల కిలోల వరకు బంగారం ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారు.
గనిలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్ విధానంలో తవ్వకాలు చేపట్టనున్నారు. టన్ను మట్టిని శుద్ధి చేస్తే సగటున ఒక గ్రాము బంగారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆధునిక క్రషింగ్, కార్బన్-ఇన్-లీచ్ టెక్నాలజీ ద్వారా ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారాన్ని వెలికితీయనున్నారు.

ప్రస్తుతం భారత్ ప్రతి ఏడాది 800 టన్నులకుపైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జొన్నగిరి ప్రాజెక్టు దేశీయ బంగారం ఉత్పత్తికి కొత్త ఊపు ఇవ్వనుంది. ప్రారంభ దశలోనే ఏడాదికి 750 నుంచి 1000 కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ గనికి ఉందని అంచనా. రాబోయే 15 సంవత్సరాల పాటు ఉత్పత్తి కొనసాగనుంది.

జొన్నగిరి విజయంతో రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు గోల్డ్ బ్లాక్‌లను వేలానికి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గోల్డ్ మైనింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ప్రధాన గోల్డ్ మైనింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు వజ్రాల గనులతో గుర్తింపు పొందిన రాయలసీమ.. ఇప్పుడు బంగారు గనులతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడుల రాష్ట్రంగానే కాదు… దేశ బంగారు భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

Tags: Mountains of pure gold in the Andhra region.