‘: మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు
అమరావతిముచ్చట్లు:
తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు సైతం ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలన్న లక్ష్యంతో మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని అనాథ పిల్లలకు కూడా వర్తింపజేయాలని, ఇందుకోసం వారి గార్డియన్ల వివరాలను కచ్చితత్వంతో సేకరించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో, ఆ నిధులను నేరుగా జిల్లా కలెక్టర్‌కు పంపి, వారి ద్వారా పిల్లలకు చేరేలా చూడాలన్నారు.
అంతేకాకుండా, అనాథ పిల్లల పేరుపై బ్యాంకు ఖాతాలు తెరిచి, పథకం నిధులను నేరుగా జమ చేయాలని సూచించారు. వారి చదువు పూర్తయ్యాక ఆ మొత్తాన్ని వారు స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఒక శాశ్వత విధానాన్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. ఇది వారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భరోసా ఇస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
అభ్యసన సామర్థ్యాల పెంపు, తెలుగు భాషకు ప్రాధాన్యం
పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువమంది విద్యార్థులు గణితం, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన లోకేశ్, ఎట్టి పరిస్థితుల్లోనూ మాతృభాష తెలుగును విస్మరించవద్దని, ఈ విషయంలో ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆయా సబ్జెక్టుల్లో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ తయారుచేసి, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు తరగతులు నిర్వహించాలన్నారు.
ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, మార్కాపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం వంటి ప్రాంతాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధ్యాయుల లభ్యతను సమీక్షించి కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరు శాతం 95కి తగ్గకుండా, మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ పడకుండా చూడాలన్నారు.
ఆధునికీకరణ, పారదర్శకత దిశగా అడుగులు
తెలుగు అకాడమీ ముద్రించే పాఠ్యపుస్తకాలను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా విక్రయించాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల అనుమతుల్లో అనవసర నిబంధనలను తొలగించాలని, అదే సమయంలో వారు నిర్ణయించిన ఫీజుల వివరాలను స్కూళ్ల బయట బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు.
హైస్కూలు విద్యార్థులకు త్వరగా క్రోమ్ బుక్స్‌తో కూడిన కంప్యూటర్ ల్యాబ్‌లు అందించాలని కూడా మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags: ‘Salute to the Mother’ for Orphaned Children Too