June 18, 2026
Explore
చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన నలుగురు యువకుల అరెస్ట్.

చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన నలుగురు యువకుల అరెస్ట్.

June 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • ఒంటరిగా ప్రయాణించే మహిళలనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠా.
  • మొత్తం 8 చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన పోలీసులు.
  • సుమారు రూ.17 లక్షల విలువైన 128 గ్రాముల (16 సవర్లు) బంగారు ఆభరణాల స్వాధీనం.
  • చోరీలకు వినియోగించిన రెండు ద్విచక్ర వాహనాల స్వాధీనం.

కేసు వివరాలు: గత కొంతకాలంగా ఓజిలి, నాయుడుపేట మరియు పరిసర మండలాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలలోని బంగారు గొలుసులను లాక్కెళ్లే చైన్ స్నాచింగ్ ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎ. శ్రీనివాసులు,(క్రైమ్స్) నాయుడుపేట ఎస్డీపీఓ జి. చెంచుబాబు గారి, పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

నాయుడుపేట రూరల్ సీఐ జి. సంగమేశ్వరరావు, ఓజిలి ఎస్ఐ కె. శ్రీకాంత్ మరియు వారి సిబ్బంది నిఘా నిర్వహిస్తూ, 17-06-2026 తేదీన ఓజిలి మండలం పెద్దపరియ క్రాస్ రోడ్డు వద్ద పిగిలాం నరేంద్ర అలియాస్ నవీన్, బల్లి లికిత్ కుమార్ అలియాస్ లిఖిత్‌లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి బంగారు చైనులు – 6, బంగారు చెవి కమ్మ – 1, మొత్తం బంగారం – 128 గ్రాములు (16 సవర్లు), హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ (నెం. AP 40 FP 3308), సుజుకి యాక్సెస్ స్కూటర్ (నెం. AP 40 LG 4421) స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితులు ఓజిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మహిళల వద్ద, నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళల వద్ద, చిట్టమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ వద్ద, బాలాయపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ వద్ద, కోట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఒక మహిళ వద్ద చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు అంగీకరించారు.

ఈ వివరాలను అదనపు ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాసులు ఎస్పీ కార్యాలయంలో జరిగిన పత్రిక సమావేశంలో వెల్లడించారు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, సందేశం ఇస్తూ, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాల వైపు అడుగులు వేస్తున్న యువత తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు. విలాసవంతమైన జీవనశైలి కోసం చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడేవారిపై తిరుపతి జిల్లా పోలీసులు ఎలాంటి ఉపేక్ష చూపరు.

మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కఠిన చర్యలు తీసుకొని వారిని చట్టం ముందు నిలబెడతాము.

తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, ఖర్చుల తీరు పట్ల అప్రమత్తంగా ఉండాలి. యువత తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే అక్రమ మార్గాలను విడిచిపెట్టి, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి.

ప్రజలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించాలి. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుంది అని అన్నారు.

ముద్దాయిల వివరాలు:

  1. పిగిలాం నరేంద్ర అలియాస్ నవీన్ (23), తండ్రి: లేట్.పుల్లయ్య, అన్నమేడు గ్రామం, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా.
  2. బల్లి లికిత్ కుమార్ అలియాస్ లిఖిత్ (19), తండ్రి: మనోహర్, కూచివాడపాళెం గ్రామం, నాయుడుపేట మండలం. ఇతనిపై గతంలో ఒక కేసు నమోదైంది.
  3. బల్లి వెంకటేశ్వర్లు (34), తండ్రి: పోలయ్య, అన్నమేడు గ్రామం, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా. ఇతనిపై గతంలో 7 దొంగతనాల కేసులు. (ఇతనిపై గతంలో గూడూరు మరియు నెల్లూరు పి.ఎస్ లలో కేసులు ఉన్నాయి.)
  4. పిగిలాం గణేష్ (32), తండ్రి: వెంకటరమణయ్య, అన్నమేడు గ్రామం, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా. ఇతనిపై గతంలో 4 కేసులు.

ఈ సమావేశంలో డిఎస్పీలు చెంచు బాబు (నాయుడుపేట), శ్యాంసుందర్ (క్రైమ్), సిఐలు సంఘమేశ్వర రావు, శివకుమార్ రెడ్డి వారు పాల్గొన్నారు.కేసును చాకచక్యంగా ఛేదించి చోరీ సొత్తును పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన నాయుడుపేట రూరల్ సీఐ జి. సంగమేశ్వరరావు, ఓజిలి ఎస్ఐ కె. శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ ఆర్వీ రాజు (HC-1891), పోలీస్ కానిస్టేబుల్ ఎన్. గంగాధర్ (PC-3895), ఈ. భాస్కర్ (PC-3508), ఎస్. వినయ్ కుమార్ (PC-3987)లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Tags: Four youths arrested for chain snatching.