: నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
సైబర్ నేరాలు, సోషల్ మీడియా కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
పోక్సో, రేప్ మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తులో నిర్దేశిత సమయాన్ని పాటించాలి.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి.
అనకాపల్లి ముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అధ్యక్షతన ఈరోజు జిల్లా స్థాయి నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లాలోని అందరు ఎస్డిపిఓలు , సర్కిల్ ఇన్స్పెక్టర్లు, మరియు సబ్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు.
సమావేశంలో భాగంగా జిల్లా ఎస్పీ జిల్లాలో నమోదైన వివిధ నేరాలు, దర్యాప్తులో ఉన్న కేసులు మరియు శాంతిభద్రతల పరిస్థితిపై సమగ్రంగా సమీక్షించారు. దర్యాప్తులో ఉన్న కేసులలో అధికారులు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు, చట్టపరమైన జాగ్రత్తలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమీక్షా సమావేశంలో ఎస్పీ ఆదేశించిన ముఖ్యమైన అంశాలు:
సైబర్ మరియు సోషల్ మీడియా నేరాలపై ఉక్కుపాదం: ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా వేదికగా జరిగే అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని ఆదేశించారు.
మహిళలు, పిల్లల రక్షణ – పోక్సో కేసులు: మహిళలపై జరిగే దాడులు, రేప్ కేసులు మరియు పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు అత్యంత పారదర్శకంగా, వేగంగా జరగాలన్నారు. ఇటువంటి కేసుల్లో 60 రోజులు మరియు 90 రోజుల కాలపరిమితి లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.
ఎస్సీ/ఎస్టీ చట్టం కేసులు: ఎస్సీ, ఎస్టీలపై జరిగే దౌర్జన్యాల కేసుల దర్యాప్తులో ఎటువంటి ఆలస్యం వహించరాదని, చట్ట ప్రకారం నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
పెండింగ్ కేసుల పరిష్కారం: పెండింగ్‌లో ఉన్న అన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను సంవత్సరం వారీగా, కారణాల వారీగా విశ్లేషించి, వాటిని త్వరితగతిన ముగించాలని ఇన్వెస్టిగేషన్ అధికారులను ఆదేశించారు.
ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణ: ఈ ఏడాది జనవరి 1, 2026 నుండి జూన్ 5, 2026 వరకు జిల్లాలో జరిగిన దొంగతనాలు, రికవరీ మరియు ఇతర ఆస్తి సంబంధిత నేరాల పై ఎస్పీ సమీక్ష జరిపారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు.
సాంకేతికతను వాడుకుంటూ నేరాల నియంత్రణలో ఐటీ కోర్ టీమ్ కీలక పాత్ర పోషించాలని, కేసుల డేటాను నిరంతరం అప్‌డేట్ చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.
ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు అందిస్తూ, జిల్లాను నేరరహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని తుహిన్ సిన్హా పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అనకాపల్లి సబ్ డివిజన్ అదనపు ఎస్పీ ఎం.శ్రావణీ, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాస రావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ బి.మోహన రావు, ఎస్.బి డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు,ఏ.ఆర్ డీఎస్పీ కె.రవి కుమార్, ఏవో సీహెచ్.తిలక్ బాబు, సీఐలు బాల సూర్యారావు, లక్ష్మి, శ్రీనివాసరావు, సతీష్, మన్మధ రావు మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags:The goal is to maintain law and order in Anakapalli district.