తిరుపతి ముచ్చట్లు:
- దూర ప్రాంత ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యం.
- ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీసు సేవలు అందుబాటులోకి.
- ఫిర్యాదుల పరిష్కారం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన మరింత వేగవంతం కానున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడి.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన పోలీసు సేవలను అందించాలనే లక్ష్యంతో పుల్లంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్,. సుబ్బరాయుడు, ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించి, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, పరిపాలనా విధానాలు, ప్రజలకు అందించనున్న సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ, తిరుపతి జిల్లా పునర్విభజన అనంతరం రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని రెండు సర్కిల్ కార్యాలయాలు కూడా రైల్వే కోడూరు పట్టణంలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. దీంతో రైల్వే కోడూరు రూరల్ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా పుల్లంపేట, పెనగలూరు, ఓబుళవారిపల్లి మండలాల ప్రజలు పిటిషన్లు, పరిపాలనా అవసరాల కోసం రైల్వే కోడూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ప్రజల సౌకర్యార్థం పుల్లంపేట మండల కేంద్రంలో రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అందుబాటులో ఉండడంతో పాటు, సర్కిల్ పరిధిలోని పుల్లంపేట, పెనగలూరు, ఓబుళవారిపల్లి, చిట్వేల్ పోలీస్ స్టేషన్ల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఫలితంగా ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావడంతో పాటు, ఫిర్యాదుల స్వీకరణ, విచారణ, సమస్యల పరిష్కారం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.
ముఖ్యంగా పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించడం తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. పుల్లంపేటలో రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటు ద్వారా ప్రజలకు సత్వర స్పందన, సమర్థవంతమైన పోలీసింగ్, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి అని పేర్కొన్నారు.
అలాగే, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా స్వీకరించి, చట్టపరమైన చర్యలు వేగంగా చేపడతామని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి (శాంతిభద్రతలు), ఏ. శ్రీనివాసరావు (క్రైమ్స్), రేణిగుంట సబ్ డివిజన్ అధికారి శ్రీనివాస రావు ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ విక్రమ్, పుల్లంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కోడూరు టౌన్ సీఐ చంద్రశేఖర్, రేణిగుంట, గాజులమండ్యం సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:District SP Subbarayudu inaugurated the Circle office.