తిరుమల ముచ్చట్లు:
బీహార్ ప్రభుత్వానికి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు కృతజ్ఞతలు
ఉత్తర భారత దేశంలో సనాతన ధర్మ ప్రచారానికి, శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక సేవలను మరింత చేరువ చేయడానికి మరో కీలక అడుగు పడింది. బీహార్ రాజధాని పాట్నా సమీపంలో గంగా నది తీరానికి దగ్గరగా, జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి, శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో బీహార్ చీఫ్ సెక్రటరీ అమృత్ ప్రత్యయ్ పాల్గొన్నారు.
ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయంతో పాటు కళ్యాణ మండపం, పుష్కరిణి, యాత్రికుల సౌకర్యాలకు అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తరించాలనే లక్ష్యంతో టీటీడీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కార్యాచరణ కొనసాగుతోంది.
ఇప్పటికే అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమి కేటాయింపు పూర్తికాగా, ఇప్పుడు బీహార్‌లోని పాట్నా సమీపంలో ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడం విశేషం.
ఉత్తర భారత భక్తులకు తిరుమల శ్రీవారితో అనుబంధాన్ని మరింత పెంచడంతో పాటు, ఈ ఆలయం భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
Tags: 15 acres of land allocated for the construction of the Srivari temple in Bihar.