June 17, 2026
Explore
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!

June 17, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కొనసాగుతున్న గాలింపు

వన్యమృగాల కదలికల కోసం మాంసం నింపిన బొమ్మలు ఏర్పాటు చేసిన అధికారులు

పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు… డ్రోన్లతో జల్లెడ

ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటన

కాకినాడ జిల్లాలోని పామాయిల్ తోటలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ పది రోజులు దాటినా లభించలేదు. దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన అధికారులు, వన్యమృగాల ఉనికిని గుర్తించేందుకు ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పాప తప్పిపోయిన ప్రాంతంలో ఇనుప బోనును ఏర్పాటు చేసి, అందులో చిన్నారిని పోలిన రెండు బొమ్మలను ఉంచారు. ఆ బొమ్మల్లో మాంసం ముక్కలను పెట్టి, జంతువులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాటి కదలికలను పసిగట్టేందుకు సమీపంలో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసి నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

కేసులో మిస్టరీని మరింత పెంచుతూ, పాపతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క జూన్ 13న మృతి చెందింది. జూన్ 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క, అప్పటి నుంచి ఆహారం తీసుకోకుండా వింతగా ప్రవర్తించింది. దీనికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సుమారు 80 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంటికి చేరిన ఈ కుక్క, వైరల్ ఇన్ఫెక్షన్ సోకి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.

జూన్ 6న తుని మండలం సిహెచ్. అగ్రహారంలో తల్లిదండ్రులు గణేష్, భవానితో కలిసి పామాయిల్ తోటకు వెళ్లిన జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. తల్లిదండ్రుల మధ్య సమన్వయ లోపం కారణంగానే పాప తప్పిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. పాప ఆచూకీ తెలిపిన వారికి జిల్లా యంత్రాంగం రూ.లక్ష రివార్డును ప్రకటించింది.

Tags: Little Jnaneshwari missing case… A new ploy involving dolls stuffed with meat!