June 17, 2026
Explore
గంగ జాతరలో యువకుల ఘర్షణ.. ఏడుగురికి గాయాలు,

గంగ జాతరలో యువకుల ఘర్షణ.. ఏడుగురికి గాయాలు,

June 17, 2026 | Andhra Pradesh

పోలీసులు థర్డ్ డిగ్రీ చేసారని ఆరోపణలు

నిమ్మనపల్లె ముచ్చట్లు:

నిమ్మనపల్లె మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న కొండసానివారిపల్లెలో ఈ నెల 13న జరిగిన గంగ జాతర సందర్భంగా రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డీజే వాహనం వద్ద నృత్యాలు చేసే సమయంలో ఏర్పడిన విభేదాలు గొడవకు దారితీయగా, ఇరు వర్గాలకు చెందిన ఏడుగురు యువకులు గాయపడ్డారు.

నాగులయ్యగారిపల్లెకు చెందిన గణేష్, బాలినాయునిపల్లెకు చెందిన పునీత్, గోపాల్, దాము, మరో వర్గానికి చెందిన రెడ్డిశేఖర్, రెడ్డిప్రసాద్, మల్లికార్జున గాయపడిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఎస్ఐ రామకృష్ణ సోమవారం రాత్రి ఇరువర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అయితే విచారణ సమయంలో పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాళ్లు, చేతులపై వాపులు వచ్చి రక్తం కారేలా కొట్టారని వారు పేర్కొన్నారు.

గాయపడిన వారిలో పునీత్‌కు మూత్రంలో రక్తం రావడంతో కుటుంబ సభ్యులు అతడిని నిమ్మనపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై రూరల్ సీఐ రవినాయక్ స్పందిస్తూ, వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags: Clash between youths at Ganga Jatara; seven injured.