వీరబల్లి ముచ్చట్లు:
వీరబల్లి మండల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజంపేట డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్పీవో) మస్తాన్ వలి పేర్కొన్నారు.
మంగళవారం సానిపాయి గ్రామ పంచాయతీలో గ్రామ స్పెషల్ ఆఫీసర్, మండల తహసీల్దార్ ఖాజా బి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా తహసీల్దార్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఖాజా బి మాట్లాడుతూ సానిపాయి గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన కార్యక్రమాల పురోగతిని గ్రామసభలో వివరించారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
అనంతరం డీఎల్పీవో మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రతి గ్రామస్థుడు ఇంటి పన్నులు, ఇతర స్థానిక పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన అన్నారు.
Tags: Creating infrastructure in villages is the government’s goal: DLPO