June 13, 2026
Explore
ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు

ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు

June 13, 2026 | Andhra Pradesh

గంగాధరనెల్లూరు

గంగాధరనెల్లూరు మండలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడిపై ఓ యువతి మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, మండలానికి చెందిన బీటెక్ విద్యార్థినికి ఆరు నెలల క్రితం కడప జిల్లాకు చెందిన శివకుమార్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇద్దరినీ గుర్తించి స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శివకుమార్‌ను హెచ్చరించి పంపించారు.

అయితే 15 రోజుల క్రితం యువతి మళ్లీ శివకుమార్ వద్దకు వెళ్లగా, అతడి వ్యవహారశైలి మరియు ఇతర మహిళలతో సంబంధాల విషయం తెలుసుకుని మోసపోయానంటూ గంగాధరనెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం శివకుమార్‌ను ఠాణా కూడలి వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా, అరెస్టయిన శివకుమార్‌ను తమకు చూపించాలని డిమాండ్ చేస్తూ యువతి బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ముగ్గురు బంధువులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.

Tags; Young woman files complaint alleging fraud under the guise of love following an Instagram introduction.