June 11, 2026
Explore
“2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.

“2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.

June 11, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • దామినేడు సభా స్థలి వద్ద జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్ర భద్రతా ఏర్పాట్ల పరిశీలన.
  • సుమారు 2000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పూర్తి స్థాయిలో బందోబస్తు.
  • సభా స్థలి, వేదిక, పార్కింగ్ ప్రదేశాలు, వీఐపీ మార్గాలు, ప్రజల ప్రవేశ–నిష్క్రమణ మార్గాలపై ప్రత్యేక నిఘా.
  • కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాల పర్యవేక్షణ.
  • ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, అత్యవసర సేవలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.
  • ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు.
  • భద్రత, ప్రజా సౌకర్యాలు మరియు అత్యవసర వ్యవస్థలకు అత్యంత ప్రాధాన్యత.

తిరుపతి జిల్లా, దామినేడు:
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు హాజరుకానున్న నేపథ్యంలో దామినేడు సభా స్థలి వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, క్షుణ్ణంగా పరిశీలించి, మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు,ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దుడి, రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, ఐపీఎస్., , ఇతర ఉన్నతాధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.

కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని సుమారు 2000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సభా ప్రాంగణం, ప్రజా గ్యాలరీలు, వీఐపీ గ్రీన్ రూములు, వేదిక పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, వీఐపీ మార్గాలు మరియు ప్రజల రాకపోకలకు సంబంధించిన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.

అదేవిధంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలు మరియు ప్రధాన ప్రజా రద్దీ ప్రాంతాలను సీసీ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించే విధంగా ప్రత్యేక బృందాలను నియమించారు.

ఈ సందర్భంగా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. ప్రతి అధికారి తన విధి నిర్వహణ స్థలం, బాధ్యతలు, కమ్యూనికేషన్ వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, మాట్లాడుతూ: 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ప్రజల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. సుమారు 2000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధి స్థలం, విధి నిర్వహణ బాధ్యతలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానంపై పూర్తి అవగాహనతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అన్నారు

సభా ప్రాంగణం, ప్రజా గ్యాలరీలు, వీఐపీ గ్యాలరీలు, గ్రీన్ రూములు, వేదిక పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, వీఐపీ మార్గాలు మరియు ప్రజల రాకపోకల ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాల సహాయంతో అన్ని ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే స్పందించే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.

ట్రాఫిక్ నిర్వహణలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాల రాకపోకలను సమర్థవంతంగా నియంత్రించాలి. పార్కింగ్ ప్రాంతాల వద్ద క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ప్రజలకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలి. ప్రజలతో మర్యాదపూర్వకంగా, సహనంతో వ్యవహరించడంతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.

ప్రతి అధికారి తన సమీప పర్యవేక్షణ అధికారితో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ సమాచార మార్పిడి చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా భద్రతకు భంగం కలిగించే ఏ అంశమైనా గుర్తించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకోవాలి. భద్రతా విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా పనిచేయాలన్నారు.అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా మరియు విజయవంతంగా నిర్వహించడం మనందరి బాధ్యత. ప్రజల భద్రతే మన ప్రధాన లక్ష్యం. అని జిల్లా ఎస్పీ సూచించారు.

Tags: Tight security arrangements for the “Two Years of Trust – Development and Welfare” program.