June 11, 2026
Explore
అభివృద్ధి పనులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలి

అభివృద్ధి పనులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలి

June 11, 2026 | Andhra Pradesh

: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

​నరసరావుపేట ముచ్చట్లు:

జిల్లాలోని అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న ప్రజల నివాసాలకు, గిరిజన తండాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం అటవీశాఖ అనుమతులను నిబంధనల ప్రకారం తక్షణమే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ శాఖ అధికారిణి కృష్ణప్రియలతో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ప్రజలు నివాసముండే ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు, తాగునీటి పైప్‌లైన్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటుతో పాటు ప్రముఖ దేవాలయాల చుట్టూ ఉండే ప్రధాన మార్గాల భూములకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అటవీ చట్టాల నిబంధనలకు లోబడి, ప్రజావసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

​ముఖ్యంగా కోటప్పకొండ దేవస్థాన అభివృద్ధి పనులు, గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, విద్యుద్దీకరణ వంటి అత్యవసర ప్రాజెక్టులకు సంబంధించిన క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అత్యవసరమైన మౌలిక వసతుల పనులకు అటవీశాఖ అనుమతులు సకాలంలో లభించేలా క్షేత్రస్థాయిలో అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో ముందుకు సాగాలని, ఎక్కడా పనులు నిలిచిపోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

​ఈ సమీక్షా సమావేశంలో కోటప్పకొండ ఈవో, మార్కాపురం గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఐటీడీఏ అధికారి పీవో, ఏపీ విద్యుత్ శాఖ ఎస్.ఇ తదితరులు పాల్గొన్నారు.

Tags: Permissions for development works must be granted immediately.