June 11, 2026
Explore
టీటీడీ ఆధ్వర్యంలో విజయవంతంగా “యోగ–టీటీడీ ఆరోగ్యానంద” కార్యక్రమం

టీటీడీ ఆధ్వర్యంలో విజయవంతంగా “యోగ–టీటీడీ ఆరోగ్యానంద” కార్యక్రమం

June 11, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

17 కేంద్రాల్లో ప్రతిరోజూ యోగాభ్యాసం

జూన్ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవానికి ఘన ఏర్పాట్లు

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ఉద్యోగుల్లో శారీరక-మానసిక దృఢత్వం పెంపొందించాలనే లక్ష్యంతో టీటీడీ నిర్వహిస్తున్న “యోగ–టీటీడీ ఆరోగ్యానంద” కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న ఈ ప్రత్యేక యోగ శిక్షణలో టీటీడీ ఉద్యోగులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొంటూ యోగాసనాలను అభ్యసిస్తున్నారు.

14 రోజుల పాటు యోగ శిక్షణ

టీటీడీ ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు ఉద్యోగులు, విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడేలా 14 రోజులపాటు ప్రతిరోజూ గంటసేపు యోగాభ్యాసాన్ని నిర్వహిస్తున్నారు.

టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పర్యవేక్షణలో తిరుపతిలోని 17 కేంద్రాల్లో యోగ శిక్షణ కొనసాగుతోంది. పరిపాలనా భవనం, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, స్విమ్స్, బర్డ్ క్యాంపస్, శ్వేత క్యాంపస్, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ కోదండరామస్వామి హైస్కూల్, ఎస్పీ గర్ల్స్ హైస్కూల్, వినాయకనగర్, గోవిందరాజనగర్, ఎల్.ఎస్. నగర్ క్వార్టర్స్ ప్రాంతాల్లో ప్రతిరోజూ యోగాభ్యాసం నిర్వహిస్తున్నారు.

యోగతో మానసిక ప్రశాంతత – శారీరక దృఢత్వం

నిత్య యోగాభ్యాసం ద్వారా ఉద్యోగులు మానసిక ఒత్తిడిని అధిగమించి భక్తులకు మరింత సమర్థవంతంగా సేవలందించగలరని టీటీడీ భావిస్తోంది. యోగ సాధన శారీరక దృఢత్వం, మానసిక వికాసం, ఏకాగ్రత, అంతర్గత చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు కూడా ఎంతో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమ సమన్వయ బాధ్యతలను టీటీడీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. తిరుపతిలోనే కాకుండా టీటీడీకి చెందిన పలు స్థానిక ఆలయాల్లో కూడా ఉద్యోగులు ప్రతిరోజూ యోగాసనాలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

యోగ పోటీలు – యోగ దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ

అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 7న తిరుపతి మహతి ఆడిటోరియంలో “యోగ–టీటీడీ ఆరోగ్యానంద” కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 18, 19, 20 తేదీలలో యోగ పోటీలను నిర్వహించనుండగా, జూన్ 21న టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags; “Yoga-TTD Arogyananda” program successfully conducted under TTD’s aegis.